జఫర్సన్ లో సమైక్య రాగం

జఫర్సన్ సిటీ : ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ అభిమతం అని మిస్సోరి రాష్ట్రంలోని జఫర్సన్ సిటీలో ఉన్న ప్రవాసాంధ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. వారంతా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. మిస్సోరి రాష్ట్రం క్యాపిటల్ భవనం ముందు వీరంతా సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. సాప్ట్ వేర్ ఇంజనీర్లయిన హేమంత్ వెన్నవల్లి, సహీర్ మోపురి, మురళి భవనం, మురళి నమశ్శివాయం, రామ్ రెడ్డి, అంబటి మనోహర్, సురేందర్, కాశీ విశ్వనాథ, బాలాజీ, వేణు లట్చుపతుల, లక్ష్మీనారాయణ, విజయ భాస్కర్, రత్నాకర్, కృష్ణ, అజయ్ లు ఈ ప్రదర్శనను ముందుకు వచ్చి నిర్వహించారు.

ఈ సందర్భంగా సహీర్ మోపురి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉంటున్న తామంతా సమైక్యాంధ్ర రాష్ట్రానికే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రకటించిన కేంద్రం నిర్ణయాన్ని ఈ సంధర్భంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు.

దశాబ్దాలుగా నలుగుతున్న ఈ అంశంపై కేవలం పదకొండు రోజులు నిరాహార దీక్షకే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయానికి ఎలా వస్తారని ఒకరు తీవ్ర స్థాయిలో భారత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి సిల్లీ కార్యక్రమాలకే రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని విభజించడం భావ్యం కాదన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. 'ఐక్యంగా ఉంటే నిలబడతాం','విడిపోతే పడిపోతాం','మనందరం తెలుగువాళ్ళం', 'మనందరం ఒక్కటే' అనే నినాదాలతో సభ ముగిసింది.
News Posted: 16 December, 2009
|