సమైక్య వైపే డల్లాస్ ఆంధ్రులు

డల్లాస్ : సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్ధిస్తూ స్థానిక తెలుగు వారు డల్లాస్ లోని కోకిల రెస్టారెంట్ లో సమావేశమయ్యారు. కొందరు స్వార్దపూరిత రాజకీయ శక్తుల కారణంగా ఈ రోజు రాష్ట్రం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని వక్తలు పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్ లో ఎన్నో దేశాలు, ప్రపంచీకరణ నేపధ్యంలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అలాంటిది ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలు విడిపోయే ఆలోచన చెయ్యడం, మన అభివృద్దిని ఎన్నో సంవత్సరాలు వెనక్కు నెట్టివేయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుతల్లి ముద్దుబిడ్డలందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉందామని వక్తలందరూ ముక్తకంఠంతో నినదించారు. తెలుగుతల్లికి శిరచ్ఛేదం చేయవద్దని అందరూ అభ్యర్ధించారు.

ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పార్టీల నాయకులందరికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక మెమోరాండం సమర్పిస్తున్నట్టు నిర్వాహకులు తెలియ చేశారు. ఎటువంటి ప్రాంతీయ భేదం లేకుండా, అన్ని ప్రాంతాల తెలుగువారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రమణారెడ్డి కృష్టపాటి, ప్రసాద్ రెడ్డి మల్లు తదితరులు నిర్వహించారు.
News Posted: 16 December, 2009
|