టొరంటోలో 'టి' సంబురాలు టొరంటో : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించిన భారత ప్రభుత్వానికి కెనడాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. డిసెంబర్ 12ను 'తెలంగాణ విజయ దినోత్సవం'గా టొరంటోలో సంబురాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తెలుగు ఎన్నారైలు హాజరయ్యారు. గ్రేటర్ టొరంటోలో సుమారు 45 వేల మంది ప్రవాసాంధ్రులు నివసిస్తున్నారు. ఒకే భాష మాట్లాడే ఆంధ్రరాష్ట్రాన్ని రెండుగా విభజించడంలో ఎలాంటి తప్పూ లేదని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధినే తెలంగాణ ప్రాంతం మొత్తం అభివృద్ధిగా చూపిస్తుండడం తప్పన్న వాదనకు సభలో పాల్గొన్న వారంతా మద్దతు తెలిపారు.
తెలంగాణ ప్రాంతంపై ఇంతకాలమూ అన్ని రంగాల్లోనూ సవతితల్లి ప్రేమనే ప్రదర్శించారని కెనడా టిడిఎఫ్ ప్రెసిడెంట్ చంద్ర స్వర్గం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణగా పది జిల్లాలున్న తెలంగాణలో 17,594 పాఠశాలు ఉంటే తొమ్మిది జిల్లాలున్న కోస్తాలో 26,800 పాఠశాలలు, నాలుగు జిల్లాలే ఉన్న రాయలసీమలో 13,001 పాఠశాలలు నడుస్తుండడాన్ని ఆయన పేర్కొన్నారు. ఇదే వేదికపై టిడిఎఫ్ కెనడా బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్, అమెరికా టిడిఎఫ్ మహేష్ మదాడి మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసే ముందు మద్దతు ప్రకటించిన అన్ని పార్టీలూ రాత్రికి రాత్రే మాట మార్చేసి, అడ్డం తిరిగాయని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజలంతా రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు పూర్తి సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రలో ప్రస్తుతం కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు భూ ఆక్రమణదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా, మరికొందరు స్వార్ధపరుల మద్దతుతోనే జరుగుతున్నదని ఆరోపించారు. స్వార్ధపూరితంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వవద్దని ఆంధ్ర ప్రజలకు టొరంటో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం విజ్ఞప్తి చేసింది.
కలిసి ఉండి రకరకాల సమస్యలతో ప్రతిరోజూ కొట్లాడుకునే కంటే సోదరభావంతో విడిపోవడమే మేలని టొరంటో తెలుగు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, కెనడా టిడిఎఫ్ కోశాధికారి శ్రీనాథ కుందూరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే ఆస్తులకు, పెట్టుబడులకు నష్టం జరిగిపోతుందని ఆంధ్ర ప్రాంతం వారిని భయపెడుతున్న స్వార్థపరులపై ఆయన నిప్పులు చెరిగారు. అలాంటి పరిస్థితే వస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారే ముందుగా భయపడాల్సి ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర వాదానికి తెలంగాణ వాసుల మద్దతు కూడా ఉందంటూ కొందరు తెలంగాణేతరులు చెబుతున్న మాటలు అనైతికం అని కలీముద్దీన్ మొహమ్మద్, నవీన్ మేరెడ్డి, జవహర్ ఆకవరం ఖండించారు. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన భారత ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తడం ద్వారా ఈ సభ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఈ సభ కోరింది.
News Posted: 19 December, 2009
|