తానా 'ఫీడ్ ది నీడీ'

వాషింగ్టన్ : 'అవసరంలో ఉన్న వారికి ఆహారం' (ఫీడ్ ది నీడీ) పేరుతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అమెరికాలోని వివిధ నగరాల్లో ఇళ్ళు లేని నిరుపేదలకు అవసరమైన ఆహారం, నిత్యావసర పస్తువులను ఈ కార్యక్రమం కింద తానా అందజేస్తున్నది. దీనిలో భాగంగా క్రిస్మస్ పండుగ రోజున వాషింగ్టన్ లోని 'బ్లెయిర్ హౌస్'లో జరిగిన కార్యక్రమంలో 100 మంది నిరుపేదలకు ఆహారం, దైనందిన కార్యక్రమాలకు కావాల్సిన వస్తువులు, గ్రీటింగ్ కార్డులు అందజేసింది.

కార్యక్రమానికి తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సుబ్బారావు కొల్లు, ట్రస్టీ నరేన్ కొడాలి, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు వేమన సతీష్, కోశాధికారి నరేంద్రరెడ్డి ఏలూరు, మధు బెల్లం, శ్రీనివాస్ రెడ్డి సోమవరపు, శ్రీనివాస్ పాలకుర్తి, పార్థసారథి తదితరులు హాజరయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇళ్ళు లేని నిరుపేదలకు తానా ఉదారంగా చేయూతనందించినందుకు బ్లెయిర్ హౌస్ డైరెక్టర్ మాక్సిన్ యంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అయ్యేందుకు చక్కని సమన్వయం చేసిన తానా సభ్యుడు తేజస్వి రాపర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

'ఫీడ్ ది నీడీ' కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన శ్రీమతి కృష్ణ బొప్పన, ములుపూరి వెంకటరావు, అంజన్ చీమలదిన్నె, డాక్టర్ నరేన్ కొడాలి, సహాయ సహకారాలు అందించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ కార్యవర్గానికి తానా ప్రెసిడెంట్ జయరాం కోమటి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ మోహన్ నన్నపనేని, ట్రస్టీ డాక్టర్ హేమప్రసాద్ యడ్ల అభినందనలు తెలిపారు.
News Posted: 28 December, 2009
|