'వంగూరి' కవి సమ్మేళనం టెక్సాస్ : వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హైదరాబాద్ లోని శ్రీ త్యారాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 3 ఆదివారంనాడు 'నా బాల్యం' అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కళా సుబ్బారావు కళావేదికలో ఈ కవి సమ్మేళనం జరుగుతుంది. వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెన్నెల 23వ కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
నూతన సంవత్సరం (2010) సందర్భంగా జరిగే ఈ కవి సమ్మేళనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ డాక్టర్ ఎన్.గోపి సభకు అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రభ సంపాదకుడు పి.విజయబాబు సభను ప్రారంభిస్తారని, ప్రత్యేక ఆహ్వానితునిగా త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు పాల్గొంటారని వంగూరి ఫౌండేషన్ వివరించింది.
కవి సమ్మేళనంలో డాక్టర్ చందుపట్ల తిరుపతిరెడ్డి (అమెరికా), తాటిపాముల మృత్యుంజయుడు (అమెరికా), రాగసుధ (యుకె), డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి, డాక్టర్ బి.ఎన్.రెడ్డి, డాక్టర్ జె.బాపురెడ్డి, డాక్టర్ కె.శివారెడ్డి, డాక్టర్ ఎం.కె.రాము, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, సుధామ, డాక్టర్ ఓలేటి పార్వతీశం, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, ప్రొఫెసర్ శిఖామణి, పింగళి గంగాధర్, డాక్టర్ ముక్తేవి భారతి, డాక్టర్ అనంతలక్ష్మి, ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్నారాణి, డాక్టర్ చిల్లర భవానీదేవి, ఎన్.అరుణ, డాక్టర్ తెన్నెటి సుధాదేవి, మహేజబీన్, పద్మజ మల్లాది తమ స్వీయ కవితలను వినిపిస్తారు.
News Posted: 30 December, 2009
|