డల్లాస్ తెలుగు వారి క్రిస్మస్

డల్లాస్ : డల్లాస్ లో తెలుగువారి క్రిస్మస్ సంబరాలు డిసెంబర్ 6వ తేదీన పాస్టర్ శాస్త్రి మీసాల సందేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. డల్లాస్ అండ్ ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు క్రిస్టియన్లు క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ పరస్పరం ఒకరి ఇంటి మరొకరు వెళ్ళారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకూ వెళ్ళి ప్రార్థనలు నిర్వహించారు. డల్లాస్ లోని తెలుగు క్రిస్టియన్లంతా వివేక్ కొల్లూరి సూచనల మేరకు కూటములుగా ఏర్పడి డిసెంబర్ 20న ప్రీ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ రోజున ఇర్వింగ్ లోని పాల్ బొప్పూరి నివాసంలో ప్రత్యేకంగా వండిన పిండివంటలతో రుచికరమైన విందుభోజనం చేశారు.
డిసెంబర్ 20 తేదీనే క్రిస్మస్ పర్వదినోత్సవాన్ని శాస్త్రి మీసాల నివాసంలో నిర్వహించారు. టాన్ టెక్స్ రేడియో ద్వారా ఆయన ప్రత్యేక క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాలకు శాస్త్రి మీసాల, రాబర్ట్ రెడ్డి సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున పాస్టర్ శాస్త్రి మీసాల సందేశంతో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తరువాత ప్రత్యేక క్రిస్మస్ గేయాలు ఆలపించారు. సామ్యూల్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం పాల్ బొప్పూరి నివాసంలో క్రిస్మస్ విందు భోజనం ఏర్పాటు చేశారు.
డల్లాస్ తెలుగు క్రిస్టియన్ల క్రిస్మస్ వేడుకలకు సుమారు వంద మంది అతిథులు హాజరయ్యారు. వీరిలో డల్లాస్ అండ్ ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో ప్రసిద్ధులైన తెలుగు వారు రావు కల్వల, ఎమ్వీయల్ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొనడం విశేషం. టాన్ టెక్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కొర్సపాటి, తానా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర తరఫున వారు పుష్పగుచ్ఛాలు నిర్వాహకులకు అందజేసి, అభినందనలు తెలిపారు.
News Posted: 30 December, 2009
|