కెనడాలో టిడిఎఫ్ ప్రదర్శన

బ్రాంప్టన్ (కెనడా) : 'జై తెలంగాణ' నినాదంతో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) కెనడా విభాగం ఒంటారియోలోని భారత రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించింది. డిసెంబర్ 28 సోమవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో టిడిఎఫ్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది పురుషులు, మహిళలు, పిల్లలు రాయబార కార్యాలయం గేటు ముందు ప్రదర్శన నిర్వహించారు. మైనస్ 6 డిగ్రీల వాతావరణంలో చలిగాలులు వణికిస్తున్నప్పటికీ ప్రదర్శనకారులు తెలంగాణ అనుకూల నినాదాలు రాసిన ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అంతకు ముందు వారంతా రాయబార కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలంతా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు వేలాది మంది కేంద్ర భద్రతా దళాలను ప్రభుత్వం మొహరించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయలేరని, ఎంతగా బలాన్ని వినియోగిస్తే తెలంగాణ ఉద్యమం మరింతగా ఉధృతం అవుతుందని టిడిఎఫ్ సభ్యులంతా హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో 144 సెక్షన్, 30 సెక్షన్ లు విధించడంలోని ఔచిత్యాన్ని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఎన్నారైలు ప్రశ్నించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత నాయకులు, ఆందోళకారులు అల్లర్లు చేసినప్పుడు, విధ్వంసాలు సృష్టించినప్పుడు ఇలాంటి నిషేధాజ్ఞలు ఎందుకు విధించలేదని వారు నిలదీశారు.
ఈ ప్రదర్శనలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినప్పటి నుంచి ఇప్పటికీ వరకూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటిని కూడా ఆంధ్ర, రాయలసీమ నాయకులు తరలించుకుపోతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాలకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలంటూ ఆంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్న డిమాండ్ అన్యాయం కాదా అని నవీన్ మేరెడ్డి ప్రశ్నించారు. మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అలాగే మద్రాసును ఉమ్మడి రాష్ట్రం కావాలని అడిగారా? అని నిలదీశారు. 'ఇంట్లోకి రానిస్తే ఇల్లంతా నాదే అన్న' విధంగా ఆంధ్ర ప్రాంత నాయకుల వైఖరి ఉందని దుయ్యబట్టారు. ఆంధ్ర నాయకుల వైఖరి చూస్తే 'ఈస్టిండియా కంపెనీ' దమననీతి గుర్తుకు వస్తోందన్నారు.
సుమన్ ముప్పిడి మాట్లాడుతూ, ప్రాంతీయ హోదా కోసం తెలంగాణ రాష్ట్ర వేర్పాటు వాదం రాలేదని, తెలంగాణ ప్రాంతంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, దళితుల అభివృద్ధి కోసం ఉద్దేశించిందన్నారు. తెలుగు మాట్లాడే వారిగా తాము గర్విస్తున్నామని అయితే, ముందుగా భారతీయులమని, తరువాతే తెలుగు వారమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎంతసేపూ ప్రాంతీయ భావాలతోనే దేశం అంతా కొట్టుకు చస్తున్నారు గానీ జాతీయతా భావం ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హోదాతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ మాట్లాడారు.
ర్యాలీలో అతీఖ్ మొహమ్మద్, చంద్ర స్వర్గం, జవహర్ ఆకవరం, రమేష్ మునుకుంట్ల, మహేష్ మాదాడి, సుమన్ ముప్పిడి, నవీన్ మేరెడ్డి, శ్రీపాల్ అనుమాళ్ళ, శ్రీనివాస్ రెడ్డి మూల, అంబర్, రాజేంద్ర ప్రసాద్ నూక, కోటేశ్వరరావు చిత్తలూరి, రాజేశ్వర్, ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరి, రామకృష్ణా రెడ్డి కొమ్మిడి, రవీందర్ మునిమండ, అంజని మెట్టు, శిరీష స్వర్గం, రజని మాదాడి, సునీత ఆకవరం, మాధవి కొమ్మిడి, విజయ చిత్తలూరి, కల్యాణి ముప్పిడి తదితరులు ఈ ర్యాలీ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ఆవశ్యకమని, ఆ క్రమంలో భారత ప్రభుత్వం ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలంటూ ప్రదర్శనకారులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.
News Posted: 31 December, 2009
|