టిఎజిసి కొత్త కార్యవర్గం నేపర్ విల్లె (ఇల్లినోయిస్) : గ్రేటర్ చికాగో తెలుగు అసోసియేషన్ (టిఎజిసి) కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. డిసెంబర్ 31న ఇక్కడ జరిగిన టిఎజిసి కార్యవర్గ సమావేశం 2010వ సంవత్సరానికి గానూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అమరేంద్ర నెట్టెం ప్రెసిడెంట్ గా, సుందర్ దిట్టకవి ప్రెసిడెంట్ ఎలెక్ట్ గాను, రోహిణి బొక్కా మాజీ ప్రెసిడెంట్ గాను, సత్యనారాయణరెడ్డి కొండపల్లి కార్యదర్శిగా, మాధవి అంగర సంయుక్త కార్యదర్శిగా, అంజిరెడ్డి కందిమళ్ళ కోశాధికారిగా, శ్రీనివాస్ ఆర్. కాశిరెడ్డి సంయుక్త కోశాధికారిగా ఏకగ్రీవం అయ్యారు. కాగా, నళిని యడవల్లి, రమేష్ గారపాటి, కల్యాణ్ ఆర్. ఆనందుల, శ్రీనివాస్ పెదమల్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
చికాగో ప్రాంతంలో టిఎజిసి అతి పెద్ద, అత్యంత పురాతన సంస్థగా ఉంది. 1971లో ప్రారంభమై 39వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న టిఎజిసిలో మూడు వందలకు పైగా కుటుంబాలకు సభ్యత్వం ఉంది. ఈ సందర్భంగా సంస్థ కొత్త అధ్యక్షుడు అమరేంద్ర నెట్టెం మాట్లాడుతూ, 2010వ సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త కార్యవర్గానికి సాదరంగా స్వాగతం పలికారు. 2010వ సంవత్సరంలో తమ కార్యవర్గం నిర్వహించాలనుకున్న, చేయాలనుకున్న కార్యక్రమాలు, ప్రణాళికల గురించి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సాధించానుకున్న ఏడు లక్ష్యాలను వెల్లడించారు. అవి :
1) తెలుగుదనం ఉట్టిపడేలా అన్ని వయస్సు వర్గాలను ప్రోత్సహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ఇతోధికంగా పెంచడం.
2) తెలుగు యువకులు మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకునేలా ప్రోత్సహించడం, నెట్ వర్కింగ్ సౌకర్యాన్ని కల్పించడం.
3) సంస్థ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని తమ తమ గ్రామాలను దత్తత తీసుకొని, 'టిఎజిసి తెలుగు డెవలప్ మెంట్ ఫండ్' ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించడం.
4) ఉన్నతీకరించిన టిఎజిసి వెబ్ సైట్ 'విజన్ 2020' ద్వారా స్థానికంగాను, ప్రపంచవ్యాప్తంగాను తెలుగువారిలో సమాచార వ్యాప్తిని, సంబంధాలను మెరుగుపరడం.
5) టిఎజిసి వార్షిక సభ్యత్వం ఉన్నవారికి టెలిఫోన్ డైరెక్టరీ సరఫరా చేయడం లాంటి ప్రాథమిక సేవలు అందించడం.
6) టిఎజిసికి చెందిన విద్యార్థులు, వలంటీర్లు, ప్రత్యేక కంట్రిబ్యూటర్లకు, సంస్థ జీవితకాల సభ్యులకు, మాజీ ప్రెసిడెంట్లకు ప్రత్యేకంగా గుర్తింపు తీసుకువచ్చే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం.
7) కమ్యూనిటీ సేవల్లో యువత ఇతోధికంగా భాగస్వాములయ్యేలా వారికి ప్రోత్సాహం అందించడం టిఎజిసి లక్ష్యాల్లో వివరించారు.
News Posted: 4 January, 2010
|