టిఎన్నారై జాక్ ఖండన ఫిలడెల్ఫియా : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేసిన ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షో కాజ్ నోటీసు ఇవ్వడాన్ని తెలంగాణ ఎన్నారై సంయుక్త కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పైన, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలను తెలంగాణ ఎన్నారై జాక్ సభ్యులంతా నిశితంగా పరిశీలిస్తున్నారని రవి మేరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కోమటిరెడ్డికి షోకాజ్ ఇవ్వడం అనుచితమైన చర్య అని టిఎన్నారై జాక్ దుయ్యబట్టింది. కోమటిరెడ్డిపై ముఖ్యమంత్రి రోశయ్య పక్షపాత ధోరణితోను, అవకాశవాదంతోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు రవి మేరెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించమని ముఖ్యమంత్రి రోశయ్యను కోరినందుకే కోమటిరెడ్డిపై ఫిర్యాదు చేసి, షోకాజ్ ఇచ్చేలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా నిలిచిన హరీష్ రావు, జానారెడ్డి, దామోదర్ రెడ్డిలను టిఎన్నారై జాక్ అభినందించింది. అప్రజాస్వామికంగా, పక్షపాత ధోరణితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ ఇచ్చిన నేపథ్యంలో తమతో పాటుగా తెలంగాణలోని ఇతర మంత్రులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా నిలవాలని వారు పిలుపునివ్వడాన్ని టిఎన్నారై జాక్ స్వాగతిస్తున్నదని రవి మేరెడ్ి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
News Posted: 4 January, 2010
|