ఎన్నారైలకూ ఓటు హక్కు న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు కూడా ఓటు వేయవచ్చని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. 'ఈ దేశాన్ని పాలించే ప్రజాప్రతినిధులెవ్వరో నిర్ణయించే ప్రక్రియలో తమకూ భాగస్వామ్యం కావాలన్న ప్రవాస భారతీయుల ప్రగాఢ వాంఛను గుర్తించాన'ని ఆయన చెప్పారు. ఈ అంశంపై తాము కసరత్తు చేస్తున్నామని మన్మోహన్ శుక్రవారం వెల్లడించారు. 2014లో జరిగే ఎన్నికల నాటికి ప్రవాస భారతీయులకు కూడా ఓటు వేసే అవకాశం కల్పించగలమన్న విశ్వాసం తనకుందని ఆయన అన్నారు. ప్రవాసి భారతీయ దివాస్ ఎనిమిదో వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాలలో ఉన్న భారతీయులు రాజకీయాలలో, ప్రజాసేవలో పాల్గొనడానికి దేశానికి ఎందుకు తిరిగిరారని ఆయన ప్రశ్నించారు.
దాదాపు 50కి పైగా దేశాల నుంచి 1500 మంది ఫ్రవాస భారతీయులు ఈ సదస్సుకు హజరయ్యారు. ప్రపంచంలోని 130 దేశాలలో ఉన్న 250 లక్షల మంది ప్రవాస భారతీయల మధ్య అవగాహన పెంచడానికి ప్రతీయేటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
భారతదేశంలోని చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రతీ పౌరుడూ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా గర్విస్తాడని ప్రధాని అన్నారు. దేశంలో ఉన్న అపారమైన శక్తి సామర్ధ్యాలు, వనరులకు అనుగుణంగా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేకపోతోందని వివరించారు. చాలా మంది దేశ శ్రేయోభిలాషులు ఈ విషయమై ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని చెప్పారు. చక్కగా రూపొందించిన విధానాలను, ప్రణాళికలును వేగంగా అమలు చేయకపోవడం పట్ల వారిలోని విసుగును గుర్తించామని మన్మోహన్ తెలిపారు. 'మనం ఎనుగులా నెమ్మదిగా కదులుతూ ఉండటం నిజమే కావచ్చు. కాని మనం వేసే ప్రతీ ముందడుగూ మనదైన స్పష్టమైన ముద్రను వదులుతున్నామన్నది కూడా అంతే నిజమ'ని ఆయన చెప్పారు.
News Posted: 8 January, 2010
|