ఆల్బనీ సంక్రాంతి సంబరాలు

న్యూయార్క్ : ఆల్బనీ తెలుగు అసోసియేషన్ (ఎటిఎ) ఆధ్వర్యంలో జనవరి 16న ఇక్కడి హిందూ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆల్బనీ తెలుగు సంఘాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు న్యూజెర్సీ టీఫాస్ అధ్యక్షుడు దాము గేదెల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దాము గేదెలను అసోసియేషన్ కార్యావర్గ సభ్యులు చంద్రశేఖర్, విజయ్ ఆది, విజయ కొక్కిలి, శృజన రవి పొక, విజయ్ రంగరాజు, శ్రీనివాస్ నాదెళ్ళ, కిశోర్ కింతలి, రాజ్ అద్దేపల్లి, అమృత మండవ, ఓం ప్రకాష్ వెలగందుల, రామ్మోహన్ లాలుకోట, బసవ శేఖర్ హర్షద్వానాలతో కార్యక్రమానికి ఆహ్వానించారు.
సంక్రాంతి సంబరాల కార్యక్రమం ముందుగా బాలాజీ కల్యాణంతో ప్రారంభమైంది. బాలాజీ కల్యాణాన్ని హిందూ దేవాలయంలో పూజారి సంపత్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యాయి. తెలుగుబడిలో తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులు ఈ గేయాన్ని ముద్దులొలుకుతూ ఆలపించారు.
సభకు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అనంతరం ఆల్బనీ తెలుగు సంఘం ప్రారంభించడానికి గల కారణాలు, సంఘం ఆశయాలు గురించి వివరించారు. ఎటిఎ ఆవిష్కరణకు చిహ్నంగా ముఖ్యఅతిథి దాము గేదెల జ్యోతి వెలిగించారు. పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాలు ఎలా కలిసి పనిచేయవచ్చో అతిథి వివరించారు.
తరువాత రెండు గంటలకు పైగా ఆల్బనీలో ఉంటున్న తెలుగు చిన్నారులు, పెద్దలు తెలుగు పాటలకు భరతనాట్యం, జానపద నృత్యాలు చేశారు. తెలుగుబడి చిన్నారులు చిన్న నాటికలు ప్రదర్శించారు. 'పరకాయ ప్రవేశం' అంటూ పెద్దలు కూడా అపరిచితుడు, అరుంధతి చిత్రాల్లోని పాత్రల ఆధారంగా ఒక పేరడీ నాటికతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. న్యూజెర్సీ నుంచి ఈ సంక్రాంతి ఉత్సవాలకు హాజరైన రాజీవ్, మధు చక్కని వీనుల విందైన పాటలు పాడి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. పవన్ గేదెల చేసిన డాన్స్ అందరినీ అలరించింది.
ఆల్బనీ సంక్రాంతి సంబరాల్లో మరో విశేషం ఉంది. అదే సంక్రాంతి స్పెషల్ ముగ్గులు, పిండివంటల పోటీ. ఈ పోటీల్లో ఆల్బనీలోని తెలుగు ఆడపడుచులు హుషారుగా పాల్గొన్నారు. రెండు పోటీల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.
సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆల్బనీ తెలుగు సంఘం కార్యదర్శి బసవ శేఖర కృతజ్ఞతలు తెలిపారు. పిమ్మట షడ్రసోపేతమైన సంక్రాంతి విందు భోజనాన్ని ఆరగించిన అందరూ సంఘం నిర్వాహకులను మెచ్చుకున్నారు. విందు భోజనం తయారీకి నాదెళ్ళ దంపతులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఉత్సవానికి రాజ్ అద్దేపల్లి, శ్రీదేవి మండవ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
News Posted: 27 January, 2010
|