ఆర్-డే డైమండ్ జూబ్లీ కాలిఫోర్నియా : గణతంత్ర దేశంగా భారత్ ఏర్పడి అరవై ఏళ్ళు అయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు అమెరికాలోని తెలంగాణ కల్చలర్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. తమ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 30న బే ఏరియాలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు టిసిఎ ప్రతినిధి విజయ్ చవ్వ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి ఉత్సవం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ అరవై ఏళ్ళ ప్రయాణంలో భారత్ ప్రపంచంలో ఓ బలీయమైన శక్తిగా ఏర్పడిందని ఆయన అభివర్ణించారు.
ఈ ఉత్సవాలకు హాజరయ్యే పురుషులు ఫుల్ సూట్ లేదా బ్లేజర్, మహిళలు చీరలు ధరిస్తే అభిలషణీయం అని విజయ్ చవ్వ తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే వారు తమ రిజర్వేషన్ కోసం టిసిఎ సంస్థ నిర్వాహకులకు ఈమెయిల్ పంపించాలని, లేదా ఫోన్ ద్వారా సంప్రతించాలని ఆయన కోరారు. కార్యక్రమాలు జరిగే ప్రాంగణం పరిమితమైనదైనందున 'ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ముందు' ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంటుందని ఆయన వివరించారు. ఇతర వివరాలు తెలుసుకోవాలంటే http://telanganaculture.org లో చూడవచ్చు.
News Posted: 27 January, 2010
|