ఆంధ్ర విద్యార్థిపై కాల్పులు
ఒక్లహామా (యుఎస్) : ఆంధ్ర విద్యార్థులపై అమెరికాలో నల్లజాతీయుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో వాకా ఆదిరెడ్డి (26) అనే విద్యార్థి గుండెపై ఇద్దరు నల్లజాతీయులు షాట్ గన్ పెట్టి కాల్చారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిరెడ్డిని వెంటనే సమీపంలో ఉన్న ఒక్లహామా యూనివర్శిటీ హాస్పిటల్ తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్న ఆదిరెడ్డి పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎన్నారై మంత్రి డి.శ్రీధర్ బాబు సహాయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా తీసుకువచ్చేందుకు వైఎస్సార్ యువసేన కృషి చేస్తున్నదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిరెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఉప్పలపాడు గ్రామం. ఆదిరెడ్డి గుంటూరు జిల్లా బాపట్లలో ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకొని ఒక్లహామా సిటీలో ఎమ్మెస్ చేస్తున్నాడు. నగరంలోని ఫ్రెండ్లీ ఫుడ్ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి స్టోర్ లో ప్రవేశించిన ఇద్దరు నల్లజాతి యువకులు ఆదిరెడ్డిపై కాల్పులు జరిపి దుకాణాన్ని దోచుకున్నారు. నల్లజాతీయుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
చురుగ్గా ఉండే ఆదిరెడ్డి పలు సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీర అభిమాని. పెద్ద మద్దతుదారు కూడా. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా గత మే నెల 23, 24 తేదీల్లో స్మిత్ విల్లెలో నిర్వహించిన విజయ యాత్రలో ఆదిరెడ్డి చక్కని పాత్ర పోషించాడని బొంతు నాగిరెడ్డి తెలిపారు.
News Posted: 4 February, 2010
|