డాలస్ లో 'వెండి తెర' డాలస్ : ప్రవాసాంధ్రులు తెలుగు సాహిత్యం పైనో, శాస్త్రీయ సంగీతం పైనో, సంఘాలు ఏర్పాటు చేయడం విన్నాం గానీ, ఎక్కడైనా తెలుగు చలన చిత్రాల పైన సంఘాన్ని ఏర్పాటు చేయడం విన్నామా? అలాంటి సంఘాన్ని అమెరికాలో మొట్ట మొదటి సారిగా 'వెండి తెర వేదిక' అనే పేరుతో టెక్సాసు రాష్ట్రంలోని డాలస్ వాసులు ఆవిష్కరించారు. ఈ సంఘం మొదటి సమావేశం ఫిబ్రవరి 7న ఫన్ ఏషియా రిచర్డ్సన్ లో జరిగింది. ఈ సమావేశంలో తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమాకి ఎనభయ్యేళ్ళ చరిత్ర ఉందనీ, అది తెలుగు వారి జీవితంలో అంతర్భాగం అయ్యిందనీ వ్యాఖ్యానించారు. వెండి తెర వేదిక ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యాలు, భవిష్యత్తులో చేయదలుచుకున్న కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత కల్వల కరుణాకర్ రావు తెలుగు సినిమా తొలి రోజుల గురించి వివరించారు.
అష్టావధాని డా. పుదూరు జగదీశ్వరన్ మాట్లాడుతూ ఇటీవల రంగులు అలుముకున్న పాత చిత్రం మాయా బజారు విశేషాలను వివరించారు. తెలుపు నలుపు చిత్రాలను వర్ణ చిత్రాలుగా మార్చడంలో సాంకేతిక వివరాల గురించి ప్రస్తావించారు. మహా భారతం ఇతివృత్తంగా కౌరవులు పాండవులు ఒక్కరు కూడా లేకుండా సినిమా తీయడం మాయా బజారులో ఒక విశేషం అని వివరించారు. తరువాత డా. జువ్వాడి రమణ తెలుగు సినిమాలలో పద్యాల గురించి ప్రసంగించారు. భువన విజయం, తిక్కన మహా భారతం, పాండవోద్యోగ విజయాలలోని పద్యాలు తెలుగు సినిమాలలో ఎలా చిత్రీకరించారో వివరించారు. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర నారాయణ్ దాసు తెలుగు హిందీ ప్రేక్షకుల అభిరుచుల వ్యత్యాసాలను గురించి ప్రస్తావించారు.
లక్ష్మీ నివాసం చిత్రం లోని 'ధనమేరా అన్నిటికీ మూలం' అనే పాటను డా. ఆళ్ళ శ్రీనివాస్ శ్రావ్యంగా పాడి దానిలోని సాహితీ విలువలను వివరించారు. తరువాత రామం దేవరాజు 'నీల కంధరా' అనే పాటలను గానం చేశారు. తోటకూర ప్రసాద్ స్వర్గీయ గుమ్మడి వెంకటేశ్వర్ రావు జీవిత విశేషాలను, ఆయనతో తనకున్న అనుభవాలను శ్రోతలతో పంచుకున్నారు. స్వర్గీయ గుమ్మడి మృతికి సంతాపంగా శ్రోతలు మౌనం పాటించారు. గుమ్మడి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. వెండి తెర కమిటీ సభ్యులు తోటకూర ప్రసాద్, డా. పులిగండ్ల విశ్వనాథం, ఎమ్వీయెల్ ప్రసాద్, డా. పుదూరు జగదీశ్వరన్, కల్వల కరుణాకర్ రావు, డా. సి ఆర్ రావు మరియు డా. జువ్వాడి రమణ ఈ మొదటి సమావేశానికి హాజరైన వారందరకీ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ వెండి తెర వేదిక ప్రతి నెల మొదటి ఆదివారం మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ఫన్ ఏషియా రిచర్డ్సన్ లో జరుగుతుంది. ఈ వేదికపై మిగతా వివరాలకు prasadthotakura@gmail.com ని సంప్రదించవచ్చు.
News Posted: 8 February, 2010
|