రెహ్మాన్ 'సుల్తాన్' ఆల్బమ్
నెవడా (యుఎస్): ఆస్కార్, గ్రామీ అవార్డుల గ్రహీత, 'మొసార్ట్ ఆఫ్ మద్రాస్' ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన 'సుల్తాన్ ది వారియర్' యానిమేషన్ చిత్రం ఆల్బమ్ త్వరలోనే విడుదల కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను యానిమేషన్ క్యారెక్టర్ లో చూపిస్తూ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఓచర్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్, బిగ్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించనున్నారు. 95 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఇంగ్లీషు, తమిళ, హిందీ, తెలుగు తదితర 18 భాషల్లో 3500 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రెహ్మాన్ స్వదేశంలో రెండు తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ('జోష్' ఫేమ్) కథానాయకుడుగా సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న 'ఏ మాయ చేసావో' చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే సోనీ మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ అయింది. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న మరో చిత్రం 'కొమురం పులి'. పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెహ్మాన్ భారతీయ యువతకు గర్వకారణమనీ, సుసంపన్నమైన సంగీత వారసత్వానికి ఆయన ప్రతీక అనీ నెవెడాలో సోమవారంనాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇండో-అమెరికన్ స్టేట్స్ మన్ రాజన్ జెడ్ ప్రశంసించారు. ఇండో అమెరికన్ లీడర్ షిప్ కాన్ఫెడరేషన్ చైర్ పర్సన్ గా జెడ్ ఉన్నారు. రెహ్మాన్ తన సంగీతంతో తూర్పు-పశ్చిమ దేశాల సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికారని ఆయన కొనియాడారు.
News Posted: 9 February, 2010
|