నాట్స్ ఉచిత వైద్య శిబిరం న్యూజెర్సీ : ఉత్తర అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగువారి కోసం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 'నాట్స్' ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జివాటర్ నగరం 780 ఓల్డ్ ఫార్మ్ రోడ్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ఓల్డ్ సన్నిధానం హాలులో ఈ శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21 ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి మోహన్ కృష్ణ మన్నవ తెలిపారు. ఈ ఉచిత శిబిరంలో వైద్య సేవలు పొందేందుకు ప్రవాసాంధ్రులు అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికా పర్యటనకు వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆరోగ్య బీమా సౌకర్యం లేని వారు ఈ ఉచిత వైద్య శిబిరం ఉచిత వైద్యసేవలు పొందవచ్చని తెలిపారు.
నాట్స్ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత ఆరోగ్య తనిఖీ, వైద్య సలహాలు, ఉచితంగా రక్తపోటు తనిఖీ, బ్లడ్ సుగర్ తనిఖీ, శరీరంలో ఉండే కొవ్వు పరిమాణం కొలత, ఆహార సలహాలు, బరువు తగ్గింపు సలహాలు, ఉచిత వైద్య కూపన్లు తదితర సేవలు అందించనున్నట్లు వివరించారు. ఎల్లవేళలా ప్రవాసాంధ్రులకు ఉచితంగా సేవలు అందించేందుకు వైద్యులు, నాట్స్ వలంటీర్లు సహృదయంతో ముందుకు వస్తున్నారని, వారి సేవలు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాన్నా, సందేహాలు, ప్రశ్నలు ఉన్నా http://natsworld.org/new/event-details.php?id=21 లింక్ లో సంప్రతించవచ్చు.
అలాగే ఈ సంవత్సరం మార్చి నెలలో కెరీర్ అసిస్టెన్స్ కార్యక్రమాన్ని న్యూజెర్సీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగువారికి ఉచితంగా సాఫ్ట్ వేర్ లో ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన వెల్లడించారు.
నాట్స్ సంస్థ ఏర్పాటైన సంవత్సరం లోపే పలు కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. తమ సంస్థ న్యూజెర్సీలో 2009 జూన్ లో నిర్వహించిన నాట్స్ ప్రారంభ కార్యక్రమానికి, అక్టోబర్ లో ఇళ్ళు, తలదాచుకునేందుకు నీడ లేని వారికి ఆహార పదార్థాల సరఫరా, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు దుస్తుల పంపిణీ, నవంబర్ 1న అమెరికా తెలుగు సంబరాల ప్రారంభ కార్యక్రమాలకు ప్రవాసాంధ్రుల నుంచి అనూహ్యమైన ప్రతిస్పందన లభించిందన్నారు. అమెరికా తెలుగు సంబరాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలంటూ వచ్చిన స్పష్టమైన సూచనల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మోహన్ కృష్ణ వివరించారు.
News Posted: 17 February, 2010
|