ఉగాది ఉత్తమ రచనల పోటీ టెక్సాస్ : గడిచిన 14 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే 'వికృతి' నామ సంవత్సర ఉగాది (2010 మార్చి 16) సందర్భంగా అమెరికాలోని వంగూరి ఫౌండేషన్ 15వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. విదేశాలలో తెలుగు భాషనీ, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ, మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరూ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు పారితోషికాలను సంస్థ అందజేస్తుంది. ఉత్తమ కథానిక : (రెండు బహుమతులు) ఒక్కొక్కటీ : 116 డాలర్లు, ఉత్తమ కవిత : (రెండు బహుమతులు) : ఒక్కొక్కటీ : 116 డాలర్లు, ఉత్తమ వ్యాసం : (రెండు బహుమతులు) : ఒక్కొక్కటీ : 116 డాలర్ల అందజేయనున్నట్లు వంగూరి ఫౌండేషన్ వెల్లడించింది.
ఈ సంవత్సర ప్రత్యేకం 'నా మొట్ట మొదటి కథ'. కథ రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ కథలను ఎక్కడా ప్రచురించని సరికొత్త కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా 'నా మొట్టమొదటి కథ' అనే ప్రక్రియ మొదలుపెట్టినట్లు సంస్థ పేర్కొంది. తమ మొట్టమొదటి కథగా పేర్కొంటూ, నూతన కథకులు తమ కథలను పంపించాలని సంస్థ కోరింది. వాటినన్నింటినీ వంగూరి ఫౌండేషన్ సంస్థ న్యాయ నిర్ణేతలు పరిశీలించి, కనీసం రెండు కథలకు ఒక్కొక్కటీ 116 డాలర్లు చొప్పున బహుమతి, ప్రశంసాపత్రం ఇచ్చి గుర్తిస్తారు.
ఇవే కాక, అర్హత ఉన్న ఇతర కథలన్నింటినీ రాబోయే 'అమెరికా తెలుగు కథానిక - పదకొండవ సంకలనం'లో ప్రచురిస్తారు. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులందరూ ఈ 'పోటీ'లో పాల్గొనాలని వంగూరి ఫౌండేషన్ ఆహ్వానించింది. 'నా మొట్టమొదటి కథ' శీర్షికతో అని మీరు సంస్థకు పంపిస్తే చాలు 'నేను ఇదివరకు ఎక్కడా నా కథలు ప్రచురించలేదు' అనే ఇచ్చే లేఖను రచయిత మాటగా సంస్థ నమ్ముతుంది. ఇది నిజానికి 'పోటీ' కాని 'పోటీ'.
అన్ని పోటీలకూ ముఖ్య గమనిక :
ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చు. ఒక్కొక్క కథ రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు. విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తారు. సొంత బ్లాగులు, వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్నా పరవాలేదు. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, 'రచన' మాసపత్రిక (హైదరాబాద్)లోనూ, రాబోయే అమెరికా తెలుగు కథానిక -11వ సంకలనంలోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలును బట్టి ప్రచురితమవుతాయి.
Pages: 1 -2- News Posted: 1 March, 2010
|