ఎన్నారైలకు 'హిందూ' లేదు ముంబయి: హిందూ సంప్రదాయాలపై మక్కువతో భారతదేశం వచ్చి పెళ్ళి చేసుకున్నప్పటికీ ప్రవాస భారతీయులకు హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఎ) వర్తించబోదని ముంబయి హై కోర్టు తేల్చి చెప్పింది. అమెరికాలో నివాసం ఉంటున్నకారణంగా భారతీయ జంటలు హిందూ వివాహ చట్టం పరిధిలోకి రావని పేర్కొంది. అమెరికన్ భారతీయ జంట సెలవుల్లో ఒక రోజు వచ్చి ఇక్కడ గడిపిన కారణంగా వారి విడాకుల కేసును విచారించే అవకాశం ఉందంటూ పూనే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ముంబయి హైకోర్టు న్యాయమూర్తి రోషన్ దాల్వీ కొట్టివేసారు.
అమెరికా కోర్టులో విడాకులు పొందిన మిచిగాన్ కు చెందిన ప్రవాస భారతీయురాలు స్మితా మూలే దాఖలు చేసిన పిటీషన్ను ముంబయి హైకోర్టు విచారించింది. ఆమె భర్త సుహాస్ మూలే(ఇద్దరి పేర్లూ మార్చినవి) భారతదేశానికి తిరిగి వచ్చి పూనే కోర్టులో విడాకుల పిటీషన్ ను దాఖలు చేశారు. ఇండియాలో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ అక్కడ దంపతులు ఏనాడూ కలిసి జీవించలేదని, వారు వైవాహిక జీవితం సాగించిన ఇల్లు అమెరికాలో ఉందని, అందువలన సుహాస్ పూనే కోర్టు పరిధిలోకి వచ్చే అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ జంట అమెరికాలో జీవిస్తున్నందున హిందూ వివాహచట్టం వర్తించబోదని, అంతే కాకుండా వారి హక్కులకు సంబంధించి అక్కడ తీర్పు ద్వారా పరిష్కారం పొందారని ముంబయి హై కోర్టు పేర్కొంది.
2008 జనవరి నెలలో పూనే లోని అవుంద్ ప్రాంతంలో ఉన్న తన తల్లితండ్రుల ఇంటిలో తామిద్దరం ఒక రాత్రి ఉన్నామని సుహాస్ పేర్కొన్నందున కేసు తమ కోర్టు పరిధిలోకి వస్తుందని పూనే ఫ్యామిలీ కోర్టు వివరించింది. అలానే సుహాస్ 2001 లో జారీ చేసిన రేషన్ కార్డు నకలను, 1999 లో పొందిన డ్రైవింగ్ లైసెన్సును, 1995లో తీసుకున్న ఓటరు గుర్తింపు కార్డును, 2019 వరకూ చెల్లే పాస్ పోర్టును కూడా ముంబయి హై కోర్టుకు సమర్పించారు. కానీ న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఈ పత్రాలేవీ కూడా ఆ వ్యక్తి భారత్ లో శాశ్వతంగానివశిస్తాడనే నమ్మకాన్ని కలిగించడం లేదని, అతని గ్రీన్ కార్డు అతను అమెరికాలో నివశించడానికే ఇష్టపడుతున్నాడనే సంగతిని ధృవీకరిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పెళ్ళికి ముందు నుంచీ కూడా ఈ ఇద్దరు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకునే ఉద్దేశంలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి తల్లితండ్రులు భారత్ లో ఉన్నారు కాబట్టి వారు ఇక్కడకు వచ్చి హిందూ ధర్మం ప్రకారం పెళ్ళి చేసుచేసుకున్నారని అభిప్రాయపడ్డారు. కాబట్టి సుహాస్ అమెరికా కోర్టు ఇచ్చిన విడాకులను అక్కడే సవాలు చేసుకోవాలని సూచించారు.
News Posted: 6 March, 2010
|