ఈసారైనా విజయం దక్కేనా?
వెల్లింగ్టన్: సిరీస్ లో ఎలాగూ మనదేనన్న ధీమాను పక్కన పెట్టి, బేసిన్ రిజర్వ్ స్టేడియంలోని సీమ్ బౌలర్లకు అనూహ్యంగా స్పందించే పిచ్ మీద జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితే, 34 సంవక్సరాల తరువాత భారతజట్టు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ గెలుచుకోగలుగుతుంది. కివీస్ తో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఆఖరి(మూడో) టెస్ట్ లో విజయసూత్రం ఇదే. ఫాస్ట్ బౌలర్లు అరివీర భయంకరులై విజృంభించే అడిలైడ్, పెర్త్(ఆస్ట్రేలియా), ట్రినిడాడ్(విండీస్), ది ఓవల్(ఇంగ్లండ్), ముల్టన్(పాకిస్తాన్), గాలె(శ్రీలంక), జోహాన్స్ బర్గ్(సౌతాఫ్రికా), హామిల్టన్(న్యూజిలాండ్)లలో టెస్ట్ విజయాలు నమోదు చేసుకున్న భారతజట్టు, 1975 తరువాత మళ్లీ అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది. గతవారం స్నెడన్ పార్క్ లో మ్యాచ్ డ్రా చేసుకుని 1-0 సిరీస్ ఆధిక్యాన్ని కాపాడుకో గలిగిన ధోనీ సేన ఈ చివరి టెస్ట్ ను కనీసం డ్రా చేసుకోగలిగినా, 1967-68 సీజన్ లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ జట్టు మాదిరిగా సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగలుగుతుంది.
అయితే అదేమంత పార్కులో షికారు చేసినంత సులువు కాదని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. స్వింగ్, సీమ్ బౌలింగుకు బాగా తోడ్పడే బేసిన్ రిజర్వ్ పిచ్ మీద భారత బ్యాట్స్ మెన్ తమ సత్తా చూపగలిగితే, ఎటువంటి పిచ్ మీద అయినా జంకు లేకుండా వీరోచితంగా పోరాడగలిగే తమ అంతర్జాతీయ ప్రమాణాలాను ఇంకా ఉన్నతస్థాయికి పెంచుకున్నవారవుతారు. విశేషం ఏమిటంటే, 1975-76, 1980-81, 1998-99, 2002-03 సీజన్ లలో ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారతజట్టు పరాజయం పాలయింది. అయితే ప్రస్తుతం భారత సీమ్ బౌలర్లు కూడా కివీస్ కు దడపుట్టించడంతో, ఇక్కడి పెచ్ లపై గడ్డిని పూర్తిగా తొలగించి, బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా తయారు చేస్తున్నారు. ఇంతవరకూ ఇక్కడ ఆడిన మూడేసి టెస్ట్ ఇన్నింగ్సులో సచిన్ టెండుల్కర్ 273, గౌతమ్ గంభీర్ 255, వివిఎస్ లక్ష్మణ్ 230, రాహుల్ ద్రవిడ్ 219 పరుగులు చేశారు. ఇదే ఫామ్ వారు కొనసాగిస్తే మూడో టెస్ట్ లో ఇండియాదే విజయమని నిస్సందేహంగా చెప్పవచ్చు.
News Posted: 2 April, 2009
|