లిఫ్టింగ్ సమాఖ్యపై నిషేధం? న్యూఢిల్లీ : భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య నుంచి మరొక దఫా సస్పెన్షన్ ను ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. పుణెలో ప్రపంచ యాంటి-డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిర్వహించిన పరీక్షలలో మరి ముగ్గురు వెయిట్ లిఫ్టర్లు దోషులని తేలింది. ముగ్గురు లిఫ్టర్లు - హర్భజన్ సింగ్ (న్యూఢిల్లీ), రాజేష్ కుమార్ (సర్వీసెస్), విజయలక్ష్మీ దేవి (ఝార్ఖండ్) ఒక శిక్షణ శిబిరంలో నిర్వహించిన డోపింగ్ పరీక్షలలో పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి.హర్భజన్, రాజేష్ 94 కిలోల విభాగంలోను, విజయలక్ష్మి 69 కిలోల విభాగంలోను లిఫ్టర్లు. అక్టోబర్ 18 నుంచి మలేషియాలో జరగనున్న కామన్వెల్త్ చాంపియన్ షిప్స్ కోసం సన్నాహకంగా సెప్టెంబర్ మొదటి వారంలో పుణెలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) సవరించిన నిబంధనల ప్రకారం, ఈ ముగ్గురిపై నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించవచ్చు.
ఈ ముగ్గురితో కలసి ఆరుగురు భారతీయ వెయిట్ లిఫ్టర్లు డోప్ పరీక్షలలో దోషులుగా బయటపడినట్లయింది. ఇంతకుముందు డోప్ పరీక్షలలో పాజిటివ్ గా ఫలితాలు వచ్చిన ముగ్గురు లిఫ్టర్లు 2002 కామన్వెల్త్ క్రీడోత్సవాల స్వర్ణ పతక విజేత శైలజా పూజారి (75 కిలోలు), ప్రియదర్శిని, పురుష లిఫ్టర్ విక్కీ బట్టా. ఇప్పుడీ తాజా ఫలితాలతో వచ్చే సంవత్సరం కామన్వెల్త్ క్రీడోత్సవాలలో భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టు పాల్గొనడం సందేహాస్పదం కానున్నది.
అయితే, ఈ తాజా ఫలితాలకు భారత సమాఖ్య కార్యదర్శి బలదేవ్ గులాటికి నోట మాట రావడం లేదు. 'వారందరూ ఏదో ఒక అనబాలిక్ స్టెరాయిడ్ తీసుకున్న సూచనలు కనిపించాయి' అని గులాటి చెప్పారు. 'కామన్వెల్త్ చాంపియన్ షిప్స్ మరి కొద్ది రోజులలో ప్రారంభం కానున్నందున ఏదైనా చేయాలని వెయిట్ లిఫ్టర్లు ప్రయత్నిస్తున్నట్లున్నది. మేము కూడా అప్పుడప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటాం. ఈ పరిణామం గడచి 20 రోజులలో సంభవించింది' అని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య నిబంధనలు (2009) ప్రకారం, ఏ దేశపు వెయిట్ లిఫ్టర్లలో ముగ్గురు నిషిద్ధ పదార్థం తీసుకున్నట్లు పరీక్షలో నిర్థారణ అయినట్లయితే సంబంధిత జాతీయ సమాఖ్యను ఒక సంవత్సరం పాటు నిషేధించవచ్చు. సస్పెన్షన్ తో పాటు సమాఖ్యకు కనీసం 50 వేల డాలర్ల జరిమానా కూడా విధించవచ్చు. జరిమానా ఎలా చెల్లించాలో అంతర్జాతీయ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయిస్తుంది.
ఇంతకుముందు, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ముగ్గురు, అంతకు మించి లిఫ్టర్లు డోప్ పరీక్షలలో దోషులుగా తేలినందున 2004, 2006 సంవత్సరాలలో ఇండియాను అంతర్జాతీయ సమాఖ్య నిషేధించింది.
News Posted: 16 October, 2009
|