టిడిపి మేనిఫెస్టో ఇదీ
హైదరాబాద్ : అందరికీ ఆరోగ్యం, ఆర్థిక మద్దతు, ఆనందకర జీవితం, రైతు శ్రేయస్సు, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు చేయూత, వృద్ధులు, మహిళా శ్రేయస్సు, గిరిజనం హక్కుల పరిరక్షణ, ఐటి రంగాభివృద్ధి ఇలా సామాన్యుడి స్వావలంబనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు గురువారం ఉదయం ఎన్నికల ప్రచార పర్వ పర్యటన ప్రారంభానికి ముందు టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ఆయన మీడియా సమావేశంలో వినిపించారు. మొత్తం 64 పేజీలతో టిడిపి మేనిఫెస్టోనూ రూపొందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఈ ప్రపంచంలోనే తాము రూపొందించిన మేనిఫెస్టో అత్యంత పవిత్రమైనదని, ఆచరణ సాధ్యమైనదని పేర్కొన్నారు. తాము రూపొందించిన నిరుపేదలకు నగదు బదిలీ, కలర్ టీవీ పథకాలను చూసి విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పథకాలు ఆచరణ సాధ్యం కాదని విమర్శిస్తున్నాయని, అయితే, తాము వీటిని అమలు చేసి తీరుతామని తన మేనిఫెస్టో ప్రసంగంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ క్రమంలోనే తాము నిరుపేదలకు 2 వేలు, పేదలకు 15 వందలు, సామాన్య తరగతికి చెందిన వారికి వెయ్యి రూపాయల చొప్పున నెల నెలా ఆయా కుటుంబాల్లోని పెద్ద వయస్సు గల మహిళల బ్యాంకు ఖాతాలో జమచేస్తామన్నారు. అలాగే వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద పీట వేశామన్నారు. నిర్దిష్ట ప్రణాళికతో రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
Pages: 1 -2- News Posted: 2 April, 2009
|