వాసవీ పూజలో భక్తిపారవశ్యం
డల్లాస్ : ఇర్వింగ్ లోని సాయి సెంటర్లో మే 10న శ్రీ వాసవీ మాత జయంత్యుత్సవాలను సుమారు 50 కుటుంబాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన పూజారి ఈ సారి పూజాదికాలు నిర్వహించారు. వాసవీ మాత పూజ అనంతరం భక్తులు అష్టోత్తర నామ, లలితా సహస్రనామ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు పెనుగొండ వాసవీ ట్రస్ట్ ఓవర్సీస్ కార్యదర్శి మురళీకృష్ణ హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనుగొండ క్షేత్రం విశేషాలను, తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డల్లాస్ ఎన్నారై వాసవైట్స్ కో ఆర్డినేటర్లు రాజేష్ చీదెళ్ళ, శ్రీనివాస్ గారేపల్లి, చంద్ర అర్థం చక్కని సమన్వయం సమకూర్చారు.
హ్యూస్టన్ : పీర్లాండ్ లోని మీనాక్షి ఆలయంలో మే 10న జరిగిన శ్రీ వాసవీ మాత జయంత్యుత్సవ పూజలకు సుమారు 250 కుటుంబాల వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమం, అభిషేకం, భజనలు, కీర్తనలు, వాసవీ మాత వృత్తాంత ప్రవచనం, పూజారి వేదమంత్రోచ్ఛారణ నడుమ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ, మహిళలే అమ్మవారి పల్లకీని మోయడం, పిల్లలు, పెద్దలు అందరూ 'కన్యకా పరమేశ్వరికీ జై' అంటూ నినాదాలు చేయడం, చక్కని విందు ఈ కార్యక్రమంలోని విశేషాలు.
వాషింగ్టన్ డిసి : వాషింగ్టన్ లో రెండోసారి నిర్వహించిన వాసవీ మాత జయంత్యువాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మే 9న జరిగిన ఈ ఉత్సవాలను వర్జీనియాలోని వెస్ట్ మారెన్ కండోమినియమ్ క్లబ్ హౌస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి బి. హరీష్ ఆధ్వర్యంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతం, వాసవీ కన్యకా పరమేశ్వరి పూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వాసవీ మాత విగ్రహాలను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది హాజరయ్యారు.
డెట్రాయిట్ : ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాలను రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న డెట్రాయిట్ వాసవైట్లు మే 10న వాసవీ మాత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. మిచిగన్ ట్రాయ్ లో ఉన్న భారతీయ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 3 వందల మంది భక్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల నుం ప్రారంభమయ్యాయి. వివిధ రకాల పూజల అనంతరం భక్తులకు చక్కని రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జయశ్రీ & కృష్ణమురళి, కవిత ప్రతాప్ పరిగి కుటుంబాలు స్పాన్సర్ చేశాయి. శ్రీమతి గీత, డాక్టర్ రోజానందం, శ్రీధర్ జి. తదితరులెందరో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చక్కని కృషి చేశారు.
లాస్ ఏంజిల్స్ : ఇక్కడ తొలిసారిగా వాసవీ మాత జయంత్యుత్సవాలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. నాగేశ్ బిజ్జల, కిశోర్ గడేవార్, హరిత బిజ్జల ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. భోజన పదార్ధాలను చక్ర ఫుడ్స్ సరఫరా చేసింది.
Pages: -1- 2 News Posted: 14 May, 2009
|