వాసవీ పూజలో భక్తిపారవశ్యం
బోస్టన్ : అమెరికాలోను, దేశవ్యాప్తంగా రెండు వారాల పాటు ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మే 10న బోస్టన్ లో వరుసగా రెండో ఏడాది నిర్వహించిన వాసవీమాత పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సుమారు 60 కుటుంబాల వారు ఈ పూజాదికాల్లో పాల్గొని వాసవీ మాత పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. బోస్టన్ లోని చిన్మయ మిషన్ పూజారి శ్రీనివాస శాస్త్రి నిర్దేశకత్వంలో ఈ ఉత్సవాలు జరిగాయి. సాయంత్రం 6.30 గంటలకు వాసవీమాత పూజ ప్రారంభమైంది. ముందుగా సంకల్పం, పిమ్మట విఘ్నేశ్వర పూజ, వాసవీ మాత అభిషేకం, వాసవీ మాత అష్టోత్తరం, మంత్రపుష్పం అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న అందరికీ అమ్మవారి విగ్రహాలను పెనుగొండలోని అఖిల భారత శ్రీ వాసవీ ట్రస్ట్ పంపించింది. పూజల అనంతరం బోస్టన్ వాసవైట్లు రుచికరమైన విందును ఏర్పాటు చేశారు.
సెయింట్ లూయీస్ : వాసవీ మాత సామూహిక జయంత్యుత్సవాలు మే 10వ తేదీన సెయింట్ లూయీస్ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మాగాంధీ సెంటర్ లో ఈ పూజలు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రాంభమైన పూజా కార్యక్రమాలు రెండు గంటల్లో ముగిశాయి. ఈ సందర్భంగా సెయింట్ లూయీస్ లోని హిందూ దేవాలయంలో వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామంటూ వాసవైట్లు తీర్మానం చేశారు. పూజ అనంతరం చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సెయింట్ లూయీస్ వాసవైట్స్ సహకారంతో పందిరి శ్రీనివాస్ సమన్వయం చేశారు.
రాలీఘ్ : మే 9న రాలీఘ్ లోని దేవాలయంలో నిర్వహించిన వాసవీ మాత జయంత్యుత్సవ పూజలకు చిన్నారులు, వృద్ధులతో సహా సుమారు 2 వందల మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు అత్యంత భక్తిపూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. గతంలో హైదరాబాద్ అష్ట లక్ష్మి ఆలయంలో పనిచేసిన పూజారి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. వాసవీ మాత పూజ, కథ అనంతరం మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేశారు.
టెంపా బే : మే నెల 10 ఇక్కడ నిర్వహించిన వాసవీమాత జయంత్యుత్సవాల్లో పాల్గొనడం ఫ్లోరిడా ప్రజలకు ఓ చక్కని వరంగా మారింది. ఫ్లోరిడాలోని హిందూ దేవాలయంలో వాసవీమాత పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశ సాంప్రదాయాలు ఉట్టిపడేలా విధంగా ఇక్కడ వాసవీ మాత జయంత్యుత్సవాలు అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగాయి.
ఓర్లాండో : ఈ నగరంలో మే 10న తొలిసారిగా శ్రీ వాసవీ మాత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తి ప్రపత్తులతో వాసవీ పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులు పూజ అనంతరం భజనలు చేశారు, లలితా సహస్రనామం పఠించారు. చిన్నారులు కూడా పూజల్లో పాల్గొనడమే కాకుండా భక్తిగీతాలు ఆలపించారు.
Pages: 1 -2- News Posted: 14 May, 2009
|