టిఎఫ్ ఏఎస్ సిల్వర్ జూబ్లీ
మధ్యాహ్న భోజనానంతరం జరిగిన బిజినెస్ సెమినార్లో న్యూజెర్సీ గవర్నర్ జోన్ ఎస్ కోర్జిన్ మాట్లాడుతూ, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సేవలను కొనియాడారు. సిఎంఈ క్రెడిట్ సెషన్ కు రోచెస్టర్ కార్డియాలజీ సంస్థకు చెందిన డాక్టర్ రవి వెంకటరమణ అధ్యక్షత వహించారు. డాక్టర్ శాంతి ఎప్పనపల్లి, డాక్టర్ కృష్ణారావు సహా 75 మందికి పైగా ఈ సెమినార్ లో పాల్గొన్నారు. జనని కృష్ణ ఆధ్వర్యంలో సాహితీ సమావేశం జరిగింది. సాహితీవేత్తలు, రెండు వందల మంది ఔత్సాహికులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. తెలుగు సాహితీ వికాస పరిణామాలపైన ఈ సెమినార్ లో విశ్లేషణాత్మకమైన చర్చ జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రత్యేక ఆహ్వానితులు బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, తరుణ్, రోజారమణి, సునీత, వినోద్ బాబు, గురుస్వామి, రమణమూర్తి, కల్పన, లహరి తదితరులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. ఇదే వేదిక పైన తెలుగు సినీ సంగీత దర్శకులు చక్రి, జి.ఆనంద్, కోటి, వందేమాతరం శ్రీనివాస్ నిర్వహించిన సంగీత విభావరి అందరినీ సంగీతానందంలో ముంచెత్తింది.
తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు దాము గేదెల, రామకృష్ణ శీతల, ఆనంద్ పాలూరు, ఇందిర యలమంచిలి, మంజు భార్గవ, లక్ష్మి మల్లెల, గిరిజ కొల్లూరి, సత్య నేమన, రోహిణి కుమార్ వేముల తదితరులు ఆరు నెలలుగా ఈ వేడుకలను విజయవంతం చేయడానికి విశేషంగా కృషిచేశారు. టిఎఫ్ఏఎస్ సంస్థ మాజీ అధ్యక్షులతో పాటు సేవా రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ కె.వి. రావు, జ్యోతిరావుకు నిర్వాహకులు అవార్డులు అందజేశారు. రామకృష్ణ, విజయ చలిగొండ దంపతులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం చేశారు. దివంగత జొన్నలగడ్డ రామకృష్ణ, కిడంబి రఘునాథ్ సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జొన్నవిత్తుల రాసిన 'తెలుగు వైభవం', గాయకుడు గంగాధర్ వ్యాఖ్యానం వేడుకలకు మరింత వన్నె చేకూర్చాయి. టిఎఫ్ ఏఎస్ సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను అతిథులకు అందజేశారు. ఈ సంచికను భావరాజు మూర్తి సహకారంతో వెలువరించారు.
టిఎఫ్ ఏఎస్ సంస్థ స్వర్ణోత్సవాలను విజయవంతం చేయడానికి దోహదపడిన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అతిథులకు నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|