టిఎఫ్ ఏఎస్ సిల్వర్ జూబ్లీ
న్యూజెర్సీ : తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ ఏ ఎస్) సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఇక్కడి రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్ లో ఘనంగా జరిగాయి. మే 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలకు తెలుగు చిత్రసీమ నుంచి పలువురు కళాకారులు హాజరయ్యారు. ఎనిమిది వందల మందికి పైగా ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాత్రంలో, సంప్రదాయ నృత్యంలో, సాహిత్యంలో, ఐటిలో, వ్యాపారంలో, జాతి సేవలో, యువజన కార్యక్రమాల్లో స్థానికంగా ఉంటున్న పలువురు ప్రవాసాంధ్రుల్లోని ఉన్న సమర్థతను గుర్తించింది. సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా టిఎఫ్ ఏ ఎస్ సంస్థ వారికి అవార్డులు అందజేసి సాదరంగా సత్కరించింది. టిఎఫ్ ఏఎస్ కు ఇతోధిక సేవలందించిన వారిని కూడా ఈ సందర్భంగా సన్మానించింది.
టిఎఫ్ ఏఎస్ సంస్థ గురించి, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా వ్యవహరించిన ఆనంద్ పాలూరి సభకు వివరించారు. ఉత్సవాల తొలి రోజు సాయంత్రం చెన్నై నుంచి వచ్చిన జి. ఆనంద్ 'స్వర మాధురి' పేరుతో నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చింది. ఈ సంగీత విభావరికి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల ప్రత్యేక అతిథిగా హాజరవగా, సుమారు వెయ్యి మంది అతిథులు వచ్చారు.
అదే హాలులో 24వ తేదీన నిర్వహించిన ప్రధాన ఉత్సవాల్లో అమెరికా వ్యాప్తంగా సుమారు 2,500 మంది అతిథులు పాల్గొన్నారు. ఆ రోజంతా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతో దూరంలో ఉన్న కాలిఫోర్నియా, టెక్సాస్, కన్సాస్, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఉత్సాహవంతులైన అతిథులు రావడం విశేషం.
అనంతరం జీయర్ ట్రస్ట్ అధిపతి చిన్న జీయర్ స్వామి తొలిరోజున జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. మనిషిలోని అంతర్గత శాంతి, ఆనందాల గురించి స్వామీజీ ప్రవచించారు. ఆ వెంటనే ప్రార్ధనా గీతం, వంద మంది యువ కళాకారులు 45 నిమిషాల పాటు నిర్వహించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ నృత్యం తెలుగు సాహిత్యం తొలి నాళ్ళ నుంచి ప్రస్తుత కాలం వరకూ ఉన్న వివిధ దశలను వర్ణిస్తూ సాగిపోయింది. నృత్య ప్రదర్శన తిలకించిన పలువురు ఆహూతులు ఆనందబాష్పాలు రాల్చారు. యువత అంశంపై ప్రొఫెసర్ సుదర్శనాచార్య ప్రసంగించారు. తరువాత నవీన్ దాల్వాయ్ ఆలపించిన పాప్ సంగీతం, వెంపటి రవిశంకర్ కూచిపూడి నృత్యం తదితర విభిన్నమైన అంశాలు అందరికీ ఆనందాన్ని పంచిపెట్టాయి. మహేష్ సలాది, అరుంధతి, గిరిజ పెనుమర్తి, గీత గొల్లపూడి, మంజు భార్గవ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేషంగా కృషిచేశారు.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|