ఘంటసాల ఆరాధనోత్సవాలు
న్యూయార్క్ : అమర గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల ఆరాధనోత్సవాలను జూన్ 7 ఆదివారంనాడు తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు టిఎల్ సిఎ సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్ ముత్యాల ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత ప్రపంచంలో రారాజు ఘంటసాలకు నివాళులు అర్పించేందుకు, వేగేశ్న ఫౌండేషన్ కోసం నిధుల సమీకరణ లక్ష్యంగా సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు.
ఘంటసాల ఆరాధనోత్సవాలను, వికలాంగులకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న వేగేశ్న ఫౌండేషన్ కు నిధులు సమీకరించే కార్యక్రమాన్ని కలగలిపి నిర్వహించాలన్న గొప్ప ఆలోచన రావడం వెనుక ఉన్న కారణాలను వెంకటేశ్ ముత్యాల వివరించారు. నిరుపేదలు, వికలాంగులకు సహాయం చేయడం అంటే ఘంటసాలకు ఎంతో ఇష్టమని, అందుకే హైదరాబాద్ లో 1988 నుంచీ వికలాంగులు, మానసిక వికలాంగులు, చెవిటి, అంధత్వంతో బాధపడుతున్న చిన్నారులను చేరదీసి, వారు సమాజంలో గౌరవంగా, నిర్మాణాత్మకంగా జీవించేందుకు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.
ఈ సంగీత విభారిలో ప్రధాన గాయకుడు, 'అపర ఘంటసాల' చంద్రతేజను టిఎల్ సిఎ ఉపాధ్యక్షుడు శ్రీనాథ్ జొన్నవిత్తుల సభకు పరిచయం చేశారు. గాయకుడిగా, ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్ గా చంద్రతేజ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రముఖ గాయని విజయలక్ష్మిని టిఎల్ సిఎ కార్యదర్శి శివ ముతికి పరిచయం చేశారు. గతంలో తమ సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో ఆహూతులను ఆమె తన గాన మాధుర్యంతో ఎలా ఓవలాడించిందీ విశదీకరించారు. విజయలక్ష్మి తన '24 గంటల నిర్విరామ గాన ప్రదర్శన'తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల పైచిలుకు కార్యక్రమాలు ఇచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. సారేగామాప ఫైనలిస్ట్ అయ్యారని, మేరీ ఆవాజ్ సునో కార్యక్రమం విజేతగా నిలిచారని, దేవదాస్, యమగోల, విక్రముడు లాంటి 70కి పైగా హిట్ చిత్రాల్లో నేపథ్యగానం చేశారని ప్రశంసించారు.
Pages: 1 -2- News Posted: 9 June, 2009
|