షికాగోలో తెలుగు పండుగ
షికాగో : సమాజ సేవే పరమావధిగా ఆవిర్భవించిన షికాగో తెలుగు అసోసియేషన్ జూలై 2,3 తేదీల్లో ఇక్కడ నిర్వహించే 'తెలుగు పండుగ' కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని ఫెస్టివల్ కో ఆర్డినేటర్ రవి ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు. సేవల ద్వారా షికాగోలోను, చుట్టుపక్కల నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాల మద్దతు కూడగట్టడం ద్వారా వారి హృదయాలను చూరగొనేందుకు షికాగో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర సహాయం, హెల్ప్ లైన్, ఉద్యోగ సంబంధ సహాయం, ఆరోగ్య పరిరక్షణలో సహాయం చేయడం, అవగాహన కల్పించడం తదితర సేవలు అందించేందుకు నిధుల సేకరణ ధ్యేయంగా ఈ తెలుగు పండుగను ఏర్పాటు చేయడం వెనుక అతి ప్రధాన లక్ష్యం అని రవి ఆచంట వివరించారు.
షికాగోలోను, ఇతర మధ్య ప్రాచ్య అమెరికా రాష్ట్రాల్లో ఒక స్థానిక సంస్థ ఇంత భారీ ఎత్తు సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని రవి ఆచంట తెలిపారు. ఈ సమావేశానికి షికాగో, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు అనేక ఆసక్తిగా తమ పేర్లను ఉత్సాహంగా నమోదు చేయించుకుంటున్నారని అన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో సమావేశం ప్రవేశ రుసుమును అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించినట్లు రవి ఆచంట ప్రకటించారు.
సిటిఎ విరాళాల కమిటీ సభ్యుడు గోపి ఆచంట, ఓవర్సీస్ ఇన్ చార్జి ప్రవీణ్ రెడ్డి భీమిరెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇటీవల కలిసి షికాగో తెలుగు పండుగలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు. తెలుగు ప్రజలకు సిటిఎ చేస్తున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ అభినందించారని, ఆశీస్సులందించారని రవి ఆచంట పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వైఎస్ హామీ ఇచ్చారన్నారు.
షికాగో తెలుగు పండుగ సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెళ్ళ మనోహర్, సూపర్ స్టార్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై సలహాదారు సిసిరెడ్డిలను 'జీవన సాఫల్య అవార్డు' (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు)లు అందజేసి గౌరవించనున్నట్లు రవి ఆచంట తన ప్రకటనలో వెల్లడించారు. స్థానిక అతిథులుగా షికాగో మేయర్ రిచర్డ్ డాలే, ఇండియ్ కాన్సలేట్ జనరల్ అశోక్ కుమార్ అత్రి ఈ పండుగలో పాలుపంచుకునేందుకు సాదరంగా సమ్మతించారని తెలిపారు.
Pages: 1 -2- News Posted: 25 June, 2009
|