తెలుగు సంబరాలు సక్సెస్
ఓర్లాండో: మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రప్రధమ మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాలు సభలకు విచ్చేసిన వేలాది మంది ప్రవాసీ తెలుగు వారితో కోలాహలంగా సాగాయి. జూలై 2 రాత్రి విందుతో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజులపాటు తెలుగు వారిని అలరించాయని నాట్స్ పబ్లిసిటీ విభాగం అధిపతి శ్రీధర్ అప్పసాని ఒక ప్రకటనలో తెలిపారు. అయిదు వేల మంది తెలుగు వారు నాట్స్ సభలకు హాజరైనట్లు శ్రీధర్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద సభలకు విచ్చేసిన తెలుగు వారు బారులు తీరి నిలబడ్డారని శ్రీధర్ తెలిపారు.
నాట్స్ మహాసభకు విచ్చేసిన వారిని ఆహ్వానిస్తూ రణ కుమార్ నాదెళ్ళ ఆహ్వాన ప్రసంగం చేశారు. అనంతరం స్వామి చైత్మానంద జ్యోతి ప్రజ్వలన చేసి నాట్స్ మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘజల్ శ్రీనివాస్ స్వరపరిచిన తెలుగు తల్లి - తెలుగు తేజం గీతానికి అనుగుణంగా 60 మంది బాలబాలికలతో నిర్వహించిన నృత్య రూపకం సభికులను అమితంగా ఆకట్టుకుంది. అనంతరం తెలుగు జాతి కీర్తిని దిశదిశలా వ్యాపించ చేసిన శ్రీకృష్ణ దేవరాయలు, అల్లూరి సీతారామ రాజు, మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు, నీలం సంజీవ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ, నందమూరి తారక రామారావులను స్మరిస్తూ యువకులు నిర్వహించిన నృత్య రూపకం కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రముఖ టివి యాంకర్ ఉదయ భాను ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చంద్రతేజ ఆలపించిన ఘంటసాల గీతాలు, వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన జానపద గీతాలు, జితేంద్ర మిమిక్రీ, సైతం సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర ప్రములు శివాజీ, తారకరత్న, తనికెళ్ళ భరణి, జయలలిత, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా, సాయి కుమార్, శివమణి, సానా, చిట్టిబాబు, ఉదయ భాను సభికులతో కలుపుగోలుగా తిరుగుతూ వారిని ఉత్సాహపరిచారు.
Pages: 1 -2- News Posted: 5 July, 2009
|