వైఎస్ రాజకీయ ప్రస్థానం
- దీనితో అదే ఏడాది కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ఆశ్చర్యకరంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని అతి చిన్న వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేరుగా నియమించారు.
- నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీయార్ పట్ల అభిమానం పెల్లుబికిన 1985 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సంతృప్తికరమైన మెజారిటీతో పులివెందుల నుంచి విజయం సాధించారు. 1985 - 89 మధ్య కాలంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ గా సేవలు అందించారు.
- 1989లో కడప పార్లమెంటరీ స్థానం నుంచి లోక్ సభ సభ్యునిగా వైఎస్ ఎన్నికై తన అభిమాన నాయకుడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేశారు. అనంతరం 1994, 96, 98 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఎంపిగా ఎన్నికయ్యారు.
- 1998లో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ ను రెండోసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించింది. పార్టీని బలోపేతం చేస్తూ 1999లో జరిగిన ఎన్నికలను వైఎస్ ఎదుర్కొన్నారు. అయితే, అప్పుడు కేంద్రంలో బిజెపికి సానుకూల గాలి వీచింది. రాష్ట్రంలో బిజెపి మద్దతుతో బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో నెగ్గడంతో అప్పుడు అధికారం చేపట్టే అవకాశం వైఎస్ చేజారింది. అయినప్పటికీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ 91 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం విశేషం.
- 1999లో అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్వచ్ఛందంగా నిరాకరించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పట్టుపట్టడంతో సరే అన్నారు.
- 1999 - 2004 సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వ్యవసాయదారులపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పోరాటాలు, ప్రజాసేవ పట్ల తనకు ఉన్న నిబద్ధత కారణంగా ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచారు.
- చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడంపై 2000 సంవత్సరం ఆగస్టులో ఎమ్మెల్యేలతో కలిసి 14 రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష ఇప్పటికింకా జనం స్మృతిపథంలోనే కదలాడుతున్నది.
- తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలోను, బయటా చక్కని ప్రణాళికతో ఎండగడుతూ వైఎస్సార్ నిర్వహించిన రాజకీయ నైపుణ్యం ఆయనను ప్రజలకు చేరువ చేసింది.
- ముఖ్యంగా 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ వైఎస్ నిర్వహించిన 1474 కిలోమీటర్ల పాదయాత్ర వైఎస్ ను నిజమైన ప్రజా నాయకుడిగా నిలిపింది. ఈ యాత్ర ద్వారా వైఎస్ రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలను సమీపం నుంచే పరిశీలించి రాష్ట్రంలోని ఆయా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చక్కని అవగాహన కలిగించుకోవడానికి ఎంతగానో దోహదం చేసింది.
- వైఎస్సార్ పాదయాత్ర అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ - దాని భాగస్వామ్య పక్షాలు చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి తిరుగులేని ఆధిక్యం సాధించింది. అదే సంవత్సరం మే 14న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన, ఇవ్వని వాగ్దానాలను కూడా ఆయన గత ఐదేళ్ల కాలంలో నెరవేర్చారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 9 July, 2009
|