మోపిదేవికి ఘన సన్మానం
న్యూజెర్సీ : తానా మహాసభలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా విచ్చేసిన సాంకేతిక విద్యా శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణను న్యూజెర్సీ తెలుగు ప్రజలు ఘనంగా సన్మానించారు. జితేంద్ర అట్లూరి ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రం నార్త్ బ్రౌన్స్విక్ నగరంలోని లిన్వుడ్ స్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. మంత్రి వెంకట రమణను రాధాకృష్ణ అతిథులకు పరిచయం చేశాారు. మంత్రి వెంకట రమణ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన క్లుప్తంగా వివరించారు.
అనంతరం ఈ సన్మాన కార్యక్రమం నిర్వాహకుడు జితేంద్ర అట్లూరి మాట్లాడుతూ, సమకాలీన రాజకీయ నాయకుల్లో ప్రజల కొరకు పాటుపడే నాయకుల్లో మంత్రి వెంకట రమణ ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. చివరిగా మంత్రి వెంకట రమణ మాట్లాడుతూ, ఎన్నికలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిన తెలుగు ప్రజలకు కృతఙ్ఞతలు తెలుపుతూ తన ఉపన్యాసం ప్రారంభించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆహూతులకు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ ఐ శాఖ గురించి ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అనంతరం అతిధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 14 July, 2009
|