'ఇండియానా'లో వైఎస్ విక్టరీ
ఇండియానాపోలిస్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60 జన్మదినోత్సవాన్ని ఇండియానాపోలిస్ లో ఘనంగా నిర్వహించారు. జూలై 8న జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. డాక్టర్ కృష్ణారావు దాసరి నివాసంలో ఆ రోజు రాత్రి 8 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు పాతిక మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. అతిథులందరినీ ఒక్కచోటకు చేర్చి డాక్టర్ కృష్ణారావు దాసరి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ, అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల బతుకులను బాగు చేసేందుకు భారతదేశంలోని, ఆంధ్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అలాగే ఇండియానాపోలిస్ లోని ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐనాక్) విభాగానికి సంపూర్ణ మద్దతు అందించాలని ఆహూతులకు విజ్ఞప్తి చేశారు. అవసరంలో ఉన్న వారికి చేయూతనిచ్చేందుకు అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని డాక్టర్ కృష్ణారావు ప్రశంసలతో ముంచెత్తారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు ఒక రోల్ మోడల్ గా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని ప్రతి సాధారణ పౌరుడికీ అందుబాటులోకి తెచ్చే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తమమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు ఆయనను ఒక విలక్షణమైన నాయకుడిగా నిలబెట్టాయని డాక్టర్ కృష్ణారావు పునరుద్ఘాటించారు.
Pages: 1 -2- News Posted: 15 July, 2009
|