మార్మోగిన 'జనం పాట'
న్యూజెర్సీ : ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాడిన 'నేలమ్మా... నేలమ్మా... నేలమ్మా... నీకు వేయి వేయి దండాలమ్మా...' పాట, గ్రామాల్లో జరిగే మంచి విషయాల గురించి సహజ గాయకుడు డాక్టర్ అందెశ్రీ పాడిన 'మన ఊరి చిరు గాలి', 'పల్లె కన్నీరు పెడుతోందిరో' అంటూ గ్రామీణులు దోపిడీకి గురవుతున్న విధానం గురించి గుండెను తడిమే విధంగా గోరెటి వెంకన్న పాడిన పాటలు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలస్ లో మార్మోగిపోయాయి. జూలై 20 సోమవారం సాయంత్రం జరిగిన 'జానపదం... జనం పాట' కార్యక్రమానికి న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, ఆల్బెని, వర్జీనియా, బోస్టన్, ట్రైస్టేట్ ప్రాంతాల నుంచి ఆరు వందల మందికి పైగా ప్రవాసాంధ్ర అతిథులు హాజరయ్యారు. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్), నల్గొండ ఓఆర్జీ సంయుక్తంగా నిర్వహించాయి.
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన జానపదం - జనం పాట కార్యక్రమం ముందుగా స్థానిక నృత్య పాఠశాల ఉపాధ్యాయిని స్వాతి జి., ఇందిరా దీక్షిత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలతో ప్రారంభమైంది. టిఎఫ్ఎఎస్ అధ్యక్షుడు దాము గేదల ఆహూతులను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రసిద్ధ కవులు, రచయితలను వేదిక మీదికి ఆయన ఆహ్వానించారు. నెల రోజుల క్రితమే తమ సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్నదని, ఆ సందర్భంగా నిర్వహించిన రజతోత్సవాలకు ఐదుగురు సంగీత దర్శకులను ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే జానపదం - జనం పాట కార్యక్రమానికి కూడా ఐదుగురు ప్రముక కవులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
నల్గొండ ఓఆర్జీకి చెందిన మహేందర్ ముసుకు అతిథులను ఆహ్వానిస్తూ, ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి, గేయ రచయిత జొన్నవిత్తుల, తెలుగు రచయిత వడ్డేపల్లి కృష్ణ, సహజ కవి, జానపద గాయకుడు డాక్టర్ అందెశ్రీ, ప్రసిద్ధ జానపద గాయకుడు గోరెటి వెంకన్నలను న్యూజెర్సీ ప్రవాసాంధ్రులకు పరిచయం చేయాలన్న సంకల్పంతో నాలుగైదు రోజుల అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఐదుగురు ప్రముఖులను సన్మానించడం, నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలకు నిధులను సమీకరించడం లక్ష్యంగా జానపదం ... జనం పాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. నల్గొండ ఓఆర్జీ స్వచ్ఛంద సంస్థ పదేళ్ళ క్రితం ఏర్పాటు చేసినట్లు వాసు విశ్వనాథం తెలిపారు. జిల్లాలోని నీటి కాలుష్యం సమస్య, దాని దుష్ఫలితాలు, నివారణ మార్గాలపై ప్రజలు, నాయకులలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు వివరించారు. నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అమర్ రెడ్డి వివరించారు. పదేళ్ళ క్రితం ఐదుగురు అంధ విద్యార్థులతో ప్రారంభమైన ఆ పాఠశాలలో ప్రస్తుతం 165 మంది అంధ విద్యార్థులకు ఆశ్రయం పొందుతున్నారన్నారు. వారిలో కొందరు సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 22 July, 2009
|