నాట్స్ హెల్ప్ లైన్ ప్రారంభం
న్యూజెర్సీ : ఉత్తర అమెరికాలోని ప్రవాసాంధ్రులకు మరింత మెరుగైన సహాయ సహకారాలు అందించే లక్ష్యంతో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 1-888-4-Telugu or www.natsworld.org/helpline పేరిట శనివారం ఇక్కడ ఓ 'హెల్ప్ లైన్'ను ప్రారంభించింది. నాట్స్ సంస్థ అందిస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగంగా ఈ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగువారు రోజువారీ ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇబ్బందులను అధిగమించేందుకు ఈ హెల్ప్ లైన్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉత్తర అమెరికాలోని ఆంధ్రులకు కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు ఈ హెల్ప్ లైన్ కృషి చేస్తుంది.
న్యూజెర్సీలో ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి శనివారం నిర్వహించిన సంగీత విభావరి సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు రవీంద్ర మాదల ఈ హెల్ప్ లైన్ ను లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులోని ప్రైమరీ కేర్ కేంద్రానికి భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు ఈ సంగీత విభావరిని ఫార్మా కేర్ సంస్థకు చెందిన విజయ్ అన్నప్పరెడ్డి, టాలీ టు హాలీ సంస్థ నిర్వాహకుడు గణేశ్ ఇందుకూరి ఏర్పాటు చేశారు.
ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్రులు హెల్ప్ లైన్ సహాయం పొందాలనుకుంటే తేలిగ్గా గుర్తుంచుకునే విధంగా '1-888-4-Telugu' నెంబర్ ను నాట్స్ సంస్థ ఏర్పాటు చేసింది. నాట్స్ సహాయం పొందగోరే వారు http://www.natsworld.org/helpline వెబ్ సైట్ ద్వారా కూడా తమ విజ్ఞప్తిని నమోదు చేయవచ్చు.
నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా ప్రస్తుతం అందజేసే సేవలు ఇవి :
- ప్రమాదం \ మరణం సంభవించినప్పుడు సహాయం : ఉత్తర అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ఎవైనా దురదృష్టకర సంఘటనల బారిన పడినప్పుడు వారి కుటుంబ సభ్యులకు అత్యవసరమైన ఆర్థిక \ నిర్ణయాత్మక మద్దతు కల్పించడం
- కెరీర్ అసిస్టెన్స్ : ఉద్యోగం కోల్పోయిన తెలుగువారు తిరిగి ఉద్యోగం సంపాదించుకు కావాల్సిన ఆధునిక నైపుణ్య శిక్షణ ఇప్పించడం
- ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ : ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి, ఇమ్మిగ్రేషన్ విధానంలో నూతనంగా వచ్చిన మార్పులపై అవసరమైన అవగాహన కల్పించడం
అతి త్వరలోనే గృహ హింస బాధితులకు సహకరించడం, వైద్య సహాయం అందించడం, విద్యార్థులకు, తెలుగు భాషాభివృద్ధికి, కుటుంబ సేవలు, మహిళాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు రవీంద్ర మాదల ప్రకటించారు. నాట్స్ హెల్ప్ లైన్ సేవలను వచ్చే ఆగస్టు 15న ఓర్లాండోలో జరగనున్న 'అమెరిగా తెలుగు సంబరాలు' నాటికి పూర్తి స్థాయిలో అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉత్తర అమెరికా పరివ్యాప్తంగా ఉన్న నాట్స్ వలంటీర్లు తమ సేవలు అందించేందుకు సహృదయంతో ముందుకు రావడంతో ఈ హెల్ప్ లైన్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిపారు. హెల్ప్ లైన్ ను వేగంగా ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నాట్స్ హెల్ప్ లైన్ డైరెక్టర్ విజయ్ రెడ్డికి ఆయన బృందంలోని సభ్యులు అనిల్ బొప్పుడి, రామకృష్ణ పుతుంబాక, శ్రీధర్ కేసాని బెట్రాండ్ యెల్లా, ప్రసన్న యాదవ, శ్రీనివాస కోనేరుకు రవి మాదల కృతజ్ఞతలు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 27 July, 2009
|