మాజీల్లో తాజా ఆశలు!
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఇందులో మాజీ మంత్రులు జేసీ, జానారెడ్డిలకు స్థానం ఉంటుందన్న కథనాలు మీడియాలో విస్తృతమయ్యాయి. జేసీనైతే అసెంబ్లీ లాబీలో కనిపించిన వారంతా (మీడియాతోసహా) ''మీరు మంత్రి అవుతున్నారట కదా'' అని ప్రశ్నిస్తున్నారు. పలువురు జేసీని అభినందిస్తున్నారు కూడా. మంత్రి వట్టి వసంతకుమార్ అయితే.. ''కా.మ! కా.మ!'' అని సంబోధించారు. కా.మ అంటే ఏమిటంటే 'కాబోయే మంత్రి' అని ఆయన తన పిలుపులో మర్మం విప్పి చెప్పారు. తనను అభినందించిన వారికల్లా ''మీడియా వారే చెబుతున్నారు. నాకైతే.. ఆయన(వైఎస్) ఇంతవరకు చెప్పలేదు'' అని జేసీ వివరిస్తున్నారు. కానీ, కాబోయే మంత్రులన్న ప్రచారం మీడియాలో 'హోరు'వాక సాగుతోంది. ఈ ప్రచారంలో జేసీ కన్నా జానారెడ్డి కొంచెం వెనుకంజలో ఉన్నారు. సీఎం వైఎస్ కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారే కానీ ఎప్పుడన్నది చెప్పనేలేదు.
ఒకవేళ మంత్రిమండలిని 'విస్తరి'స్తే మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డితోసహా ఇప్పటివరకు మంత్రి పదవులు పొందని వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరికి తోడుగా డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన కుతూహలమ్మ, మహ్మద్ జానీ, రాయపాటి శ్రీనివాస్ తదితరులు కూడా అందలాన్ని ఆశిస్తున్నారు. వీరందరిదీ ఒక ఎత్తైతే పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ది మరో వ్యధ! ఆయన పీసీసీ అధ్యక్షుడైన తాను గెలిస్తే 'ముఖ్య'మైన పదవిని ఆశించవచ్చని భావించిన డీఎస్ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు దారి తీశాయి. 2004లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిఫార్సు వల్లే ఆయనకు మంత్రిమండలిలో స్థానం విషయం తెలిసిందే! 2009 ఎన్నికల్లో ఓడిపోవడంతో మంత్రి పదవిని కోరలేని స్థితిలో ఉన్నారు. విస్తరణలో తనకూ స్థానం కల్పిస్తే కాదనేది లేదని డీఎస్ అంటున్నారట.
Pages: -1- 2 -3- News Posted: 3 August, 2009
|