తానా బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

డల్లాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), టాన్ టెక్స్ సంస్థలు నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు సంయుక్తంగా నిర్వహించిన బ్యాక్ ప్యాక్ ల పంపిణీ విజయవంతం అయిందని తానా ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. నలభై డాలర్ల విలువైన మొత్తం 300 బ్యాక్ ప్యాక్ లను ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు అందజేసినట్లు ఆయన వివరించారు. డల్లాస్, యులెస్, ఫోర్ట్ వర్త్ సిటీలలో బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బ్యాక్ ప్యాక్ లు అందుకున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, నగరాల్లోని అధికారులు నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తానా చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. బ్యాక్ ప్యాక్ ల పంపిణీని తానా ప్రతి సంవత్సరం చేస్తున్నదని ప్రసాద్ తోటకూర వెల్లడించారు.
యులెస్ లోని హెచ్ ఇ బి పాఠశాలలో జరిగిన బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమానికి పాఠశాల సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోర్ట్ వర్త్ సిటీలోని ఎ.ఎం. పేట్ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బ్యాక్ ప్యాక్ ల కోసం వంద మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు క్యూ కట్టారు. పాఠాశాల ప్రారంభం రోజున తమకు బ్యాక్ ప్యాక్ లను తానా, టాన్ టెక్స్ సంస్థలు సంయుక్తంగా అందించడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు. తానా చేస్తున్న సేవలను పాఠశాల ప్రిన్సిపాల్ ఎరిక్ మూడీ, పౌర సంబంధాల డైరెక్టర్ జానీ క్రిస్టీ, పాఠశాల సమన్వయకర్త మేరీ రేంజల్ కొనియాడారు.
Pages: 1 -2- News Posted: 31 August, 2009
|