సిలికానాంధ్ర వార్షికోత్సవం

బే ఏరియా : ప్రసిద్ధ ప్రవాస తెలుగు సంస్థ సిలికానాంధ్ర వార్షికోత్సవాన్ని అక్టోబర్ 3వ తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బే ఏరియాలో నిర్వహిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 'ఆంధ్రా కల్చరల్ ఫెస్టివల్ - 2009' (ఎసిఎఫ్) పేరున కుపెర్టినోలోని ఫ్లింట్ సెంటర్ ఉన్న డేఆంజ కాలేజిలో జరగనున్న సిలికానాంధ్ర వార్షికోత్సవంలో ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధ వయొలిన్ సంగీత విద్వాంసుడు, భారత శాస్త్రీయ సంగీతం, ఫ్యూజన్ మ్యూజిక్ విద్వాంసుడు పద్మభూషణ్ డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం, ఆయన సతీమణి, భారత సినీ సంగీత అభిమానుల హృదయాలను దోచుకున్న పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి దంపతుల సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల తెలిపారు.
సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంధ్ర కల్చరల్ ఫెస్టివల్ సందర్భంగా 3 వందల మందికి పైగా కళాకారులు రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనుండగా, రెండు వేలమందికి పైగా అతిథులు హాజరవుతారని అంచనా. ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు, పెద్దల లలిత సంగీతం, 'శ్రీ ఆంజనేయం' అనే పూర్తిస్థాయి నాటకం, వేదాంతం వెంకట్ నిర్వహణలో 'యక్షగానం' కూచిపూడి డ్యాన్స్ బాలే, దేశభక్తి ఇతివృత్తంగా 'ప్రియ భారతం' నృత్య కార్యక్రమంతో పాటు పలు హాస్యరస కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటినీ స్థానిక సిలికానాంధ్ర సభ్యులే రూపొందించి, నృత్యాలు సమకూర్చి, నిర్వహిస్తూ, ప్రదర్శించడం విశేషం.
Pages: 1 -2- News Posted: 16 September, 2009
|