ప్రవాసాంధ్ర సేవా సమితి నివాళి న్యూయార్క్ : 'అమెరికా ప్రవాసాంధ్ర సేవా సమితి' ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో నివసించే ప్రవాసాంధ్రులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మృతి అనంతర రాజకీయ పరిస్థితులను చర్చించేందుకు సెప్టెంబర్ 12 శనివారం సాయంత్రం కాన్ఫరెన్సు కాల్ నిర్వహించారు. డాక్టర్ వై. ఎస్ మృతికి సంతాప సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత ఈ చర్చ ప్రారంభమైంది.
న్యూయార్క్ సిటీలో IT డైరెక్టర్ గా పనిచేస్తున్న మారుతి శర్మ నిమిషకవి మాట్లాడుతూ, డాక్టర్ వై ఎస్. మరణం సమైక్యాంధ్ర స్ఫూర్తికి పెద్ద ఎదురుదెబ్బ అన్నారు. తాడిత, పీడిత ప్రజలకు వైఎస్ హఠాన్మరణం గుండెకోత మిగిల్చిందన్నారు. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్నా, వై.ఎస్. ప్రాంభించిన పధకాలు కొనసాగాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వారంతా వెలుబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని శక్తులు వేచి చూస్తున్నాయని అన్నారు.
న్యూజెర్సీలో వెటెరినేరియన్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ చీనేపల్లి మాట్లాడుతూ, వై.ఎస్సార్ ఆశయాలు సాధించాలన్నా, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా జగన్ లాంటి యువ నాయకుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క జగన్ మాత్రమే వై.ఎస్ కలలను సాకారం చేయగలరని అన్నారు.
ఆర్కాన్సాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డి బత్తుల మాట్లాడుతూ, జలయజ్ఞం సాధనకు జగన్ ను ముఖ్యమంత్రిగా నియమించటం ఒక ఆవశ్యకత అన్నారు. డెట్రాయిట్ నుంచి హరిప్రసాద్ లింగాల, డాక్టర్ ధనుంజయరెడ్డి గడ్డం, ఎడ్ల వీరయ్య చౌదరి మాట్లాడుతూ, ఢిల్లీలో కూర్చుని ఆలోచించే మేధావుల అభిప్రాయం కంటే, ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని గౌరవించి జగన్ కి పట్టం కట్టాలని డిమాండ్ చేశారు.
ఫ్లోరిడాలో నివసించే సాయి ప్రభాకర్ ఎర్రాప్రగడ, శివ చిత్తూరు, ఒహియో నుంచి వై.ఎస్ ఫాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల, గోగినేని అప్పారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంటే తమకు చాల గౌరవమని, ఆయన 30 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని, కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో వయోభారం కారణంగా ఆయనకిది శక్తికి మించిన పని అన్నారు.
రోశయ్య విషయంలో జరిగిన ఆలస్యం జగన్ విషయంలో కాకుండా ఉండాలని ఆకాంక్షించారు. కాలిఫోర్నియా నుంచి లోకేష్ బొమ్మక, నాగార్జున, న్యూజెర్సీ నుంచి వెంకట జంగా, ఇంకొల్లు మోహన్ మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీ, కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలు అమలు జరగాలన్నా, రైతులకు అండ కావాలన్న జగన్ వంటి నేత ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
Pages: 1 -2- News Posted: 17 September, 2009
|