'తెలుగు' ఓ చైతన్య దీపిక

టెక్సస్ : తెలుగు భాష నేర్చుకోవడం అమెరికాలోని ప్రతి తెలుగు విద్యార్థీ ఒక సాంస్కృతిక అవసరంగా భావించాలని, టెక్సస్ తెలుగు విద్యార్థులు అమెరికాలోని తెలుగు కుటుంబాలన్నిటికీ అందిస్తున్న సందేశమని తానా ప్రెసిడెంట్ - ఎలెక్ట్ ప్రసాద్ తోటకూర ఉద్ఘాటించారు. టెక్సస్ యూనివర్సిటీ తెలుగు విధ్యార్థుల సంఘం బుధవారం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ తెలుగు భాషా దినోత్సవం తమకు సరికొత్త స్ఫూర్తినిస్తోందని, తెలుగు భాష, సంస్కృతి పట్ల ఈ తరం తెలుగు విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తి తెలుగు కోర్సుల పట్ల తమలో మరింత చైతన్యాన్ని నింపుతోందని ఆయన అన్నారు.
తమ యూనివర్సిటీలో తెలుగు కోర్సు ప్రవేశపెట్టినప్పుడు ఐదుగురు విద్యార్థులు వస్తే అదే గొప్ప అనుకున్నామని వర్సిటీ ఆసియా శాఖ చైర్మన్ ప్రొఫెసర్ జొయెల్ బ్రెర్టన్ అన్నారు. ఇప్పుడు ముప్పయి మంది విద్యార్థులు ఈ వర్శిటీలో తెలుగు నేర్చుకోవడం ఆనందకరమైన విజయం అని తెలిపారు. వినూత్న బోధనా పద్ధతులతో, అంకిత భావంతో డాక్టర్ అఫ్సర్ ఈ విజయం సాధించారన్నారు. ఇలాంటి సమర్థుడైన అధ్యాపకుడు లభించినందుకు యూనివర్సిటీ గర్వపడుతోందని ప్రొఫెసర్ జొయెల్ బ్రెర్టన్ ప్రశంసించారు. తెలుగు సంస్కృతికి సంబంధించిన పరిశోధనకు ప్రేరణ ఇవ్వడంలో ఈ కోర్సు విజయవంతమైందని ఆయన అన్నారు. తెలుగు సాహిత్య సాంస్కృతిక అంశాల మీద పరిశోధనకు విద్యార్థులు ముందుకు వస్తున్నారని ప్రొఫెసర్ బ్రెర్టన్ తెలిపారు.
టెక్సస్ లోని వివిధ నగరాల్లో ఉన్న తెలుగువారిని, తెలుగు సంఘాలను కలుపుకొని తెలుగు కోర్సును పది కాలాల పాటు నిలపడానికి కృషిచేస్తామని, రెండో తరం తెలుగువారిలో తెలుగు భాష పట్ల ఎంత అభిమానం, గౌరవం ఉన్నాయో ఈ కోర్సు విజయం వల్ల అర్థం అవుతోందని ప్రముఖ రచయిత డాక్టర్ విష్ణుభొట్ల లక్ష్మన్న అన్నారు. తానా సౌత్ వెస్ట్ రీజినల్ డైరెక్టర్ మురళి వెన్నం కూడా ఈ సభలో పాల్గొన్నారు.
Pages: 1 -2- News Posted: 25 February, 2010
|