'తెలుగు' ఓ చైతన్య దీపిక
ఉత్తమ తెలుగు విద్యార్థులకు రెండు అవార్డులు :
ఆస్టిన్ తెలుగు కోర్సులలో ప్రతిభ చూపిన ఇద్దరు ఉత్తమ విద్యార్థులకు శాన్ ఆంటోనియో తెలుగు సంఘం రెండు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని గోవిందరాజు మాధవరావు ప్రకటించారు. ఇప్పటికే తానా రెండు అవార్డులను ప్రకటించిందని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ అవార్డులు ప్రదానం చేస్తామని డాక్టర్ అఫ్సర్ ప్రకటించారు.
ఆస్టిన్ వర్శిటీలో తెలుగు కోర్సులను కొనసాగించడానికి కావలసిన నిధుల సేకరణకు వివిధ నగరాల్లోని తెలుగు సంఘాలతో చర్చలు ప్రారంభించామని, అన్ని ప్రాంతాల ప్రతినిధులతో తెలుగు కమిటీ ఏర్పడుతుందని తానా తెలుగు భాషా కమిటీ చైర్మన్ రాంకీ చేబ్రోలు చెప్పారు.
తెలుగు నేర్చుకోవడం గొప్ప అనుభవం :
'ఈ కోర్సు తీసుకోక ముందు మా కుటుంబ సభ్యుల మధ్య నేను ఒక అపరిచితుడిలాగా ఉండేవాణ్ని. తెలుగు కోర్సు తీసుకున్నాక కుటుంబం మరింత దగ్గిర అయ్యింది. ఇప్పుడు అందరం ఒకే భాషలో మాట్లాడుకోవడం తీయని అనుభూతి' అని తెలుగు కోర్సులో మొదటి సంవత్సరం విద్యార్థి పట్టిసపు నవీన్ సంబరపడ్డారు.
'ద్రావిడ భాషల మీద ఉన్న అభిమానంతో తెలుగు వైపు మళ్ళాను. ఆస్టిన్ తెలుగు కోర్సు తీసుకున్నాక ఈ అభిమానం ఇప్పుడు పూర్తిగా తెలుగు వైపు మళ్ళింది' అన్నాడు నికోల రజిక అనే రష్యన్ విద్యార్థి. తన పరిశోధనకు తెలుగు బాగా ఉపయోగపడుతుందని నికోలా చెప్పాడు.
తెలుగు సంస్కృతిపై ప్రసంగాలు :
తెలుగు సంస్కృతిపై అవగాహన కలిగించే ఉపన్యాసాలను నెలకు ఒకటి చొప్పున ఏర్పాటు చెయ్యాలని తెలుగు విద్యార్థి సంఘం నిర్ణయించిందని అధ్యక్ష, ఉపాధ్యక్షులు దివ్య యలమంచిలి, దీపికా ముత్యాల చెప్పారు. తెలుగు సాహిత్యం, కళా రంగాల గురించి ఈ ప్రసంగాలు ఉంటాయని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు విద్యార్థి విశాల్ సాపురపు పాడిన త్యాగరాజ కృతులు అందరినీ అలరించాయి.
Pages: -1- 2 News Posted: 25 February, 2010
|