మన ఘనుడు ఎంఎన్ఆర్ అసలు ఎవరీ గుప్త.. ఓ సాదా సీదా కుటుంబం నుంచే వచ్చాడు. గుంటూరు జిల్లా వాసైన మద్దుల వెంకటరామయ్య, సీతామహాలక్ష్మి దంపతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వరకూ గుప్త చదవంతా భీమవరంలోనే సాగింది. ఎంటెక్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు. 2000 నాటికి దేశంలో రహదారుల స్వర్ణయుగం నడుస్తూ ఉండటంతో గుప్త ట్రాన్స్ పోర్టేషన్ లో ఎంటెక్ చేశాడు. పాఠశాల స్థాయిలోనే ప్రతిభావంతుడైన విద్యార్ధిగా పేరుతెచ్చుకున్న గుప్త అనేక క్విజ్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి వరకూ వెళ్ళాడు. ఎంటెక్ పూర్తయిన తరువాత జాతీయ రహదారుల ప్రాజెక్టులో హైవే ఇంజనీరుగా పనిచేసాడు. 2003 వరకూ రాజస్థాన్ లో పనిచేసిన గుప్త ఆ తరువాత విదేశీ అవకాశాలను వెదుక్కున్నాడు. దానికి కారణం ఒక్కటే. దశాబ్దకాలం నుంచి మన రాష్ట్రంలోని యువకులంతా తమ ప్రతిభకు తగిన గుర్తింపు రావాలని, అవకాశాలు రావాలని, భవిష్యత్ బాగుండాలని ఆశించడం మొదలు పెట్టారు. సరిగ్గా అవే కారణాలతో గుప్త కూడా తన చదువుకు తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. ఒమన్ దేశంలో అవకాశం వచ్చింది. పెట్రోలియం ప్రాజెక్టులో ఇంజనీరుగా చేరిన గుప్త 2005 నుంచి ఒమన్ సోహర్ ఇన్ ప్రాస్ట్రక్చర్ కంపెనీలో రోడ్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గుప్త భార్య సాహిత్య కూడా ఇంజనీరే కావడంతో ఒమన్ లో ఎల్ అండ్ టిలో ప్లానింగ్ విభాగంలో పని చేశారు..
భారతదేశం సూపర్ పవర్ గా రూపాంతరం చెందాలంటే ఏంచేయాలన్న అంశంపై ఎంఎన్ఆర్ దాదాపు ఐదేళ్ళపాటు కష్టపడి వేల జర్నల్స్ రూపొందించాడు. సమాజాభివృద్ధికి చాలా కీలకమైన రంగంగా మౌలిక సదుపాయల కల్పన అని గుప్త బలంగా వాదిస్తాడు. 'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ ఎ లాట్' అనే సూత్రంపై ఏకంగా ప్రత్యేక టెక్నాలజీని రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు. అంతేనా కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సరే ఒకరిద్దరు రాజకీయ నాయకులు గుప్త విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ముదావహమే కానీ అది ఆయనను కాస్త గర్వపడేలా చేసినా సంపూర్ణమైన సంతృప్తిని మాత్రం ఇచ్చిందని భావించలేం. ఎందుకంటే దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనేది గుప్త నిశ్చితమైన అభిప్రాయం. ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గుప్తాను అసహనానికి గురిచేస్తూ ఉంటుంది. దానినే ఆయన అనేక వేదికలపై వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. దారి తప్పిన అభివృద్ధికి వక్రమార్గాలే కారణమని, దీనిని సరిచేయడానికి యువకులు ముందుకు రావాల్సిందేనని గుప్త ధైర్యంగా ఎలుగెత్తుతాడు.
దేశంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఫలితంగా భారత్ ఏటా రవాణా రంగంపై వేల కోట్ల రూపాయలు నష్టపోతుందని గుప్తా చెబుతాడు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి అదీ ఎగుడుదిగుడు లేని స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని వాదిస్తాడు. గడచిన అరవై సంవత్సరాల్లో ఈ రంగం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైందని అవేదన పడతాడు. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని గుప్తా సిద్ధాంతం. అమెరికా లాంటి దేశం పురోగామి దిశలో పయనించడానికి అక్కడ ఏర్పాటు చేసిన రహదారి వ్యవస్థేనని సోదాహరణగా చెబుతాడు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి గుప్తా అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యాయనం చేశాడు.
Pages: -1- 2 -3- News Posted: 24 March, 2010
|