మన ఘనుడు ఎంఎన్ఆర్
భారతదేశానికే సొంతమైన అపారమైన సహజవనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నది గుప్త అందమైన ఆలోచన. కానీ ప్రస్తుతం దేశంలోని విద్యావ్యవస్థ, రాజకీయ వ్యవస్థ దానికి అనుగుణంగా లేవన్నది అతని ఆక్రోశం. ప్రపంచంలోనే యువ జనభా ఎక్కువగా, అత్యుత్తమ ప్రతిభావంతులు ఉన్నదేశం భారత్ అని, అయితే కమ్యూనికేషన్ నైపుణ్యత, నాయకత్వ లక్షణాల లోపం వలన వీరు వెనుకబడుతున్నారని గుప్త అభిప్రాయం. దేశంలో ఇప్పుడున్న విద్యావిధానాన్ని ప్రక్షాళణ చేసి పారిశ్రామిక ప్రాధాన్యత ఉండే ప్రాక్టికల్స్ కు ప్రాముఖ్యత ఇచ్చే విద్యావిధానం రావాలని ఆయన ప్రతిపాదన. అలానే పరిశోధన, అభివృద్ధి విభాగానికి నిధులు కేటాయింపు పెరగాలని, విద్యార్ధి కళాశాలలో చదివే చదువుకు, బయటకు వచ్చి చేసే పనికి సంబంధం ఉండాలని, అప్పడే మానవశక్తి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చని గుప్త అంటాడు.
ఇక రాజకీయ వ్యవస్థపై ఎంఎన్ఆర్ ఆక్రోశం కూడా అర్ధం చేసుకోతగ్గదే. ఈ దేశాన్ని పాలించే రాజకీయ నాయకులకు కనీస విద్యార్హతను నిర్ణయించకపోవడం సకల అనర్ధాలకు కారణమని ఈ యువకుడు స్పష్టంగా చెబుతాడు. ఒక జిల్లా అధికారి కావాలంటే ఐఎఎస్ అవ్వాలి. అంటే కనీసం గ్రాడ్యుయేషన్, ఆపై రాత పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక పరీక్షల్లో నెగ్గి, శిక్షణ పొంది రావాలి. మరి అలాంటి అధికార యంత్రాంగంపై అజమాయిషీ చెలాయించే మంత్రులు ఏమీ చదవక్కర్లేదు. ఇది దారుణం కాదా? అని ప్రశ్నిస్తాడు. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యుడినే వైద్యశాఖకు మంత్రిగా నియమిస్తారని ఆయన చెబుతాడు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ కారణంగానే సహజ వనరుల వినియోగం సక్రమంగా లేదని వాపోతాడు.
సేవారంగంలో కూడా ఎంఎన్ఆర్ తనదైన ముద్రను వేసుకోగలిగాడు. ఒమన్ లో పదిమందితో గుప్తా ప్రారంభించిన వరల్డ్ తెలుగు ఫోరం ఇప్పుడు దాదాపు 30 దేశాలకు విస్తరించింది. విదేశాలలో ఉద్యోగాలు వెదుక్కునే తెలుగువారికి అది సహాయ సహకారాలు అందిస్తోంది. అలానే ఆంధ్రలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడల్లా ఫోరం అపన్నహస్తం అందిస్తోంది. అందుకే గుప్తను దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారంతా అభిమానిస్తారు. సాదరంగా ఆహ్వానించి సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుగు నేలపైనే కాదు తెలుగువాడున్న హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, భీమవరం ఎన్నోచోట్ల ఈ యువకుడిని సన్మానించారు.అమెరికా తెలుగువారైతే ఎంఎన్ఆర్ గురించి వివరాలు పొందుపరిచి ఏకంగా ఒక బ్లాగ్ పోస్టు(http://nriva-people.blogspot.com/2010/02/mnrguptas-felicitation-and-pictures.html-.)నే ప్రారంభించారు. వాటిని వినమ్రంగా స్వకరించే ఎంఎన్ఆర్ కప్పుకోడానికి శాలువాలు, లెక్కపెట్టుకోడానికి జ్ఞాపికలుగా భావించలేదు. తాను పడుతున్న శ్రమను, సేవను గుర్తించి శభాష్ అంటూ తెలుగువారి ప్రేమగా తలపోసి, తన బాధ్యత మరింత పెరిగిందనే భావనతోనే ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. మనవాడు. మన తెలుగువాడు. మన భారతీయుడు.
Pages: -1- -2- 3 News Posted: 24 March, 2010
|