'స్పృహలేని చిరు వ్యాఖ్యలు'
మిచిగన్ : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 'ఇంజనీర్లు పిడికెడన్నం పుట్టించలేరు' అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎద్దేవా చేయడాన్ని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. చిరంజీవి వ్యాఖ్యలు ఇంజనీర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చిరంజీవికి సాంకేతిక రంగం మీద ఎంత అవగాహన ఉందో తెలుస్తోందని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ ఆక్షేపించింది.
ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంజనీర్లు రైతు కుటుంబాలు నుంచి వచ్చిన వాళ్ళే అన్న విషయం చిరంజీవికి తెలుసో తెలియదో అని కమిటీ ఎద్దేవా చేసింది. ఇప్పుడు చిరంజీవి ఎక్కి తిరుగుతున్న వాహనం కూడా ఒక ఇంజనీర్ కనిపెట్టిందే అని, అన్ని రంగాలు కలిసి పనిచేస్తేనే అబివృద్ధి, మార్పు సాధ్యం అని చిరంజీవి తెలుసుకోవాలని కమిటీ వ్యాఖ్యానించింది. అబివృద్ధి రంగాలఫై అవగాహన లేకుండా మాట్లాడుతున్న చిరంజీవి ఇక మార్పు ఎలా తీసుకువస్తారో ఆయనే ఆలోచించుకోవాలని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ పేర్కొంది.
'ఒక ఇంజనీరు ముద్ద అన్నం పండించలేకపోవచ్చు... కానీ తన మేధస్సుతో ఆ అన్నం పండించే అన్నదాతకు అండగా నిలవగలడు. తన శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించగలడు. అన్నదాత పంట దిగుబడిని పెంచగలడు. క్రిమి కీటకాలు, పురుగుల నుండి అన్నదాత పంటను కాపాడగలడు... అన్నదాతకు వ్యవసాయంలో నూతన పద్ధతులు, పండిన పంటకు మార్కెటింగ్ అలాగే పండిన పంటను నిలువ చేసుకొనేందుకు తన మేధస్సుతో సహాయపడగలడు... రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లలో 90% మంది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే.... ఆ కుటుంబాలన్నీ ఆ విద్యావంతుల మీద ఆధారపడటంలేదా... ఒక విద్యావంతుడు అన్నదాతకు ఇన్ని చేయగలడు. అయితే సినిమా హీరో ఒక్క మెతుకు అన్నం పుట్టించగలడా అని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ చిరంజీవిని నిలదీసింది.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|