`తానా'షాల తగువు తీరింది..!
హైదరాబాద్: కడుపులో కత్తులు దాచుకున్న బద్ధ శత్రువులు మంచి మిత్రులుగా మారే మహా రాజకీయాన్ని తెలుగు సాంస్కృతిక సంఘాలు కూడా ఒంటబట్టించుకుంటున్నాయి. ఇంతకాలం కత్తులు దూసుకొని, కోర్టులకెక్కిన `తానా' వైరిపక్షాలు తాజాగా కోర్టు వెలుపల రాజీకొచ్చాయి. కత్తులు పక్కన పడేసి కౌగిలించుకున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో గత ఏడాదిగా జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజీతో ముగిసింది.
గత సెప్టెంబర్ లో తానా అధ్యక్షుడు కాకరాల ప్రభాకర చౌదరిని పదవీచ్యుతుడిని చేసి జయరాం కోమటి తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సభ్యత్వాల నమోదు నుంచి ఈ ఏడాది నిర్వహించవలసిన ద్వైవార్షిక సదస్సు వేదిక నిర్ధారణ దాకా రకరకాల వివాదాలు మొదలై చివరికి ప్రభాకర చౌదరి పదవి పోగొట్టుకున్నారు. ఆయనపై టెక్సాస్ కోర్టులో కేసు దాఖలయింది. మరోవైపు ఆయన అనుచరుడు రవి మాదల మేరీలాండ్ కోర్టులో ఇంకో కేసు దాఖలు చేశారు.
త్వరలో తానా ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇరువర్గాలూ రాజీకొచ్చి కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. నాయకులైతే పెద్దమనసుతో రాజీ చేసుకున్నారు కానీ, పలువురు సాధారణ సభ్యులు ఈ ఇరువర్గాల అసాధారణ వ్యవహార శైలితో విసిగిపోయి, త్వరలో జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... తానా ద్వైవార్షిక సదస్సును ఓర్లాండోలో నిర్వహించాలని రెండేళ్ల క్రితం అధికారికంగా నిర్ణయించారు. సభల నిర్వహణ కోసం సంస్థ అధ్యక్షుడు ప్రభాకర చౌదరి ఏర్పాట్లు మొదలుపెట్టారు. తన మిత్రుడు రవి మాదలకు ముఖ్యబాధ్యతలు అప్పగించడం ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయరాం కోమటి వర్గానికి రుచించలేదు. ఓర్లాండోలో సభలను నిర్వహిస్తే రవి బలపడిపోయి సంస్థను తమ ప్రాబల్యాన్ని అడ్డుకుంటారని భయపడ్డారు. అందుకే, సభల వేదికను షికాగోకు మార్చాలని పట్టుబట్టారు. కుదరదని కాకరాల వర్గం తేల్చిచెప్పింది. ఉభయపక్షాలూ పట్టుదలకు పోయి వివాదాలను వీధికెక్కించాయి. ఓర్లాండోలో సభావేదికల కోసం పెద్దమొత్తంలో అడ్వాన్సుగా చెల్లించామని, ఇప్పుడు వేదికను మారిస్తే లక్షన్నర డాలర్ల దాకా వదులుకోవలసి ఉంటుందని ప్రభాకర చౌదరి ఆలస్యంగా సెలవిచ్చారు.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|