బాటా ఉగాది వేడుకలు
కాలిఫోర్నియా : బే ఏరియా తెలుగు అసోసియేషన్ మార్చి 21న నిర్వహించిన 8వ వార్షిక ఉగాది (విరోధినామ) ఉత్సవాలు అత్యంత ఉత్సాహభరిత వాతావణంలో జరిగాయని సంస్థ సంయుక్త కార్యదర్శి రమేష్ కొండా ఒక ప్రకటనలో తెలిపారు. సన్నీవేల్ లోని సన్నీవేల్ ఆలయం కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన విరోధినామ ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఉగాది తెలుగు మేళా, యూత్ టాలెంట్ షో కార్యక్రమాల్లో చిన్నారులు, టీనేజ్ పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పుష్పాలతోను, వేదిక వెనుక అలంకరణ, రంగు రంగుల విద్యుద్దీపాల అలంకరణతో ఉగాది ఉత్సవాల సభా ప్రాంగణమై ఆలయం ఆడిటోరియం సరికొత్త శోభను సంతరించుకుంది. నాలుగేళ్ల చిన్నారులు మొదలు వృద్ధుల వరకూ అందరినీ భాగస్వాములను చేసిన విరోధినామ ఉగాది ఉత్సవాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ మొత్తం రోజంతా ఉత్సాహపూరితం వాతావరణంలో జరిగాయని రమేష్ కొండా ప్రకటనలో వివరించారు.
బే ఏరియా ఉగాది ఉత్సవాలకు రవి ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీసెస్ అండ్ రాజి ఇన్సూరెన్స్ వారు మహా దాతలుగా, చానెల్ రియల్ ఎస్టేట్ అండ్ మార్టిగేజ్ సంస్థ ప్లాటినమ్ స్పాన్సర్లుగా, పిఎన్ జి జువెలర్స్, నమస్తే ప్లాజా, రెమిట్ 2 ఇండియా సంస్థ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరించినట్లు రమేష్ కొండా తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 'యూత్ టాలెంట్ షో' ఒక్కటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిరంతరాయంగా కొనసాగింది. ఈ షో ద్వారా ప్రవాసాంధ్రుల చిన్నారులు, యువతీ యువకులు సంగీతం, నృత్యం తదితర అంశాల్లో తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేందుకు చక్కని వేదికను కల్పించింది.
సాంప్రదాయ బద్ధమైన మామిడాకుల తోరణాలతో ఉత్సవాల సభా ప్రాంగణాన్నిఅలంకరించడంతో ఈ ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరూ తాము ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉగాది వేడుకలు నిర్వహించుకున్న అనుభూతిని పొందారు. సాంప్రదాయ చీరలు, ఓణీలు, పంచెలు ధరించి శాస్త్రీయ, ప్రసిద్ధ జానపద గీతాలు ఆలపించిన విధానం ఆహూతులందరినీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. యూత్ టాలెంట్ షో కార్యక్రమానికి అపర్ణ, రాజేశ్ యాంకర్లుగా వ్యవహరించారు. బాటా కమిటీ సభ్యులు శ్రీలు వెలిగేటి, విజయ ఆసురి యూత్ టాలెంట్ కార్యక్రమాన్ని అత్యంత సమర్థంగా నిర్వహించారు. చిన్నారుల కళా ప్రదర్శనలతో అలరించగా పెద్దలు క్యారమ్స్, చెస్, పెయింటింగ్ లాంటి అంశాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. డ్రాయింగ్ పోటీలను గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత అరవింద్ కొత్త పర్యవేక్షించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆహూతులందరికీ ఉగాది పచ్చడిని సరఫరా చేశారు. ఉగాది పచ్చడిని ఫ్రీమాంట్ లోని బిర్యానీ బౌల్ సంస్థ తయారు చేసింది. ఈ ఉగాది ఉత్సవాలకు హాజరైన సుమారు రెండు వేల మంది అతిథులతు హాలు పూర్తిగా కిక్కిరిసిపోయింది.
బాటా సలహా సంఘం సభ్యుడు, సాంస్కృతిక వ్యవహారాల చైర్ పర్సన్ విజయ ఆసురి ఉగాది ఉత్సవాల సాయంత్రం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయం పూజారి చింతపల్లి వేంకటేశ్వర శర్మ ఉగాది ఉత్సవాలకు హాజరైన అందరికీ ఆశీర్వచనాలు పలికారు.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|