బాలుకు తానా 'లైఫ్ టైమ్'
షికాగో : ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టి.వి. కార్యక్రమాల నిర్వాహకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 2009వ సంవత్సరానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తానా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి కాకరాల ఒక ప్రకటనలో తెలిపారు. తానా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఈ సంవత్సరం తమ సంస్థ మహాసభల సందర్భంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సంవత్సరం జూలై 2 నుంచి 4వ తేదీ మధ్య షికాగోలోని రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్లో తానా మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
1999 నుంచీ ప్రతి రెండేళ్ళకోసారి జరిగే తానా మహాసభల్లో తమ తమ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన తెలుగు వారికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును క్రమం తప్పకుండా అందజేస్తున్నామని ప్రభాకర్ చౌదరి కాకరాలె తెలిపారు. ఇంతకు ముందు తానా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి పి. సుశీల, ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు వెంపటి చినసత్యం, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు, ప్రొఫెసర్ సిఆర్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి దత్, ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు, ప్రసిద్ధ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావులకు అందజేశారు.
Pages: 1 -2- News Posted: 1 April, 2009
|