బాలుకు తానా లైఫ్ టైమ్ అవార్డు
ఎస్పీ సుబ్రహ్మణ్యం లేదా ఎస్పీబి లేదా బాలుగా ప్రసిద్ధుడైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న జన్మించారు. ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట బాలసుబ్రహ్మణ్యం జన్మస్థలం. బాలు తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరెన్నికగన్న హరికథకుడు. బాలసుబ్రహ్మణ్యం తన చిన్ననాట నుంచే సంగీతం అంటే చెవులు కోసుకొనేవారు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా ఆయన సంగీతం పట్ల మక్కువను వదలలేకపోయారు. మద్రాసుకు చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ 1964లో నిర్వహించిన ఔత్సాహిక సంగీత కళాకారులకు నిర్వహించిన పోటీలో బాలసుబ్రహ్మణ్యం ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. 1966లో నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న సినిమా ద్వారా బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లో పాడే అవకాశాన్ని తొలిసారిగా ఎస్పీ కోదండపాణి కల్పించారు. బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 36 వేల పాటలను పైగా పాడారు. అత్యధిక సినిమా గీతాలు పాడిన గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గిన్నెస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. నిరాడంబరంగా, అంకితభావంతో పనిచేసే బాలసుబ్రహ్మణ్యం అంటే సిని పరిశ్రమలో అందరికీ అభిమానమే. ఆయన వ్యవహార శైలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం సంగీతకారులు, సంగీత దర్శకులు మరింతగా అభిమానిస్తారు.
నాలుగు దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతూనే బాలసుబ్రహ్మణ్యం అనేక రంగాల్లో కూడా రాణించారు. సుమారు 70కి పైగా చిత్రాల్లో ఆయన చక్కని నటనా వైద్యుష్యాన్ని ప్రదర్శించారు. 47 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాలుగు సినిమాలు నిర్మించారు. 1990లో ప్రారంభమైన 'పాడుతా తీయగా' కార్యక్రమం మొదలు అనేక టి.వి. కార్యక్రమాల నిర్వాహకుడిగా బాలసుబ్రహ్మణ్యం వ్యవహరించారు.
అనేక ఇతర అవార్డులతో పాటు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. బాలసుబ్రహ్మణ్యానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి అభినందించింది. 1979లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పాడిన 'ఓంకార నాదానుసంధానమౌ' గీతం మొదలుకొని ఇప్పటి వరకూ ఆయన మొత్తం ఐదు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవాల్లో ఆయన మొత్తం 21 నంది అవార్డులను గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యానికి 'కలైమామణి' బిరుదునిచ్చి సత్కరించింది. వీటితో పాటు బాలసుబ్రహ్మణ్యాన్ని అనేక ఫిలింఫేర్ అవార్డులు కూడా వరించాయి.
Pages: -1- 2 News Posted: 1 April, 2009
|