బాటా వార్షిక వాలీబాల్ టోర్నీ
కాలిఫోర్నియా : బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) మూడో వార్షిక వాలీబాల్ టోర్నీ ఈ నెల 18న అత్యంత ఉల్లాసకర వాతారవణంలో జరిగింది. స్థానిక సన్నివేల్ లోని ఎన్సిన్ల్ పార్క్ లో నిర్వహించిన ఈ వార్షిక వాలీబాల్ టోర్నీలో మొత్తం 46 జట్లు పాల్గొన్నాయి. ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ 'బిర్యానీ బౌల్' కు చెందిన ప్రవీణ్, జాస్ & అసోసియేట్స్ ఎల్ ఎల్ సికి చెందిన జయ్ ప్రసాద్ వేజెండ్ల ఈ టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ టోర్నీ ద్వారా సమకూరిన నిధులను భారతదేశంలో నిర్వహిస్తున్న 'ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ -ఐఎల్ పి' కి అందజేస్తామని బాటా అధ్యక్షుడు ప్రసాద్ మంగిన ఒక ప్రకటనలో తెలిపారు.
బాటా వాలీబాల్ టోర్నీలకు గతంలో లభించిన అత్యధిక జనాదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పురుషులను 'అడ్వాన్స్ డ్', 'ఇంటర్మీడియట్', 'రిక్రియేషనల్' అనే మూడు విభాగాలుగా విభజించి నిర్వహించామన్నారు. అలాగే మహిళలకు ప్రత్యేకంగా మరో విభాగంలో వాలీబాల్ పోటీలు నిర్వహించామన్నారు. మొత్తం 46 బృందాలుగా 300 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రసాద్ మంగిన పేర్కొన్నారు. చక్కగా ప్రాక్టీస్ చేసిన క్రీడాకారులు, వారికి హుషారుగా మద్దతు ఇచ్చే ప్రేక్షకులు, అభిమానులు, మద్దతుదారులతో టోర్నీ మైదానం కిక్కిరిసిపోయిందని ఆయన వివరించారు. ప్రారంభ టోర్నీలు రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో కొనసాగగా, ప్రతి గ్రూప్ నుంచి టాప్ లో ఉన్న రెండు జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరాయన్నారు. ఈ టోర్నీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ నిరవధికంగా కొనసాగిందన్నారు. కొన్నీ పోటీలు హోరాహోరీగా కొనసాగగా, మరి కొన్ని మ్యాచ్ లు టై అయ్యాయి. మరికొన్ని పోటీల ఫలితాలు ఒక్కటి రెండు పాయింట్ల తేడాతో ముగిశాయి. పోటీలన్నింటినీ ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠతో తిలకించి ఆనందించారు.
పోటీల ముగింపు కార్యక్రమంలో బాటా అధ్యక్షుడు ప్రసాద్ మంగిన క్రీడాకారులు, క్రీడాభిమానులు, టోర్నీకి వలంటీర్లుగా వ్యవహరించిన వారికి, బాటా కమిటీ సభ్యులకు, టోర్నీని స్పాన్సర్ చేసిన వారికి, హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నీని చక్కగా రూపొందించిన శివ్ శేఖర్ పేపర్తి కషికి గుర్తింపుగా బాటా కమిటీ జ్ఞాపికను, ప్రశంశా పత్రాన్ని బహూకరించింది. టోర్నీ విజేతలు, రన్నర్లందరికీ ట్రోఫీలు, బే ఏరియాలో నిర్మించిన తెలుగు సినిమా 'ఏది నిజం' కాంప్లిమెంటరీ టిక్కెట్లను అందజేశారు.
Pages: 1 -2- News Posted: 25 April, 2009
|