'గీత'లో కృష్ణుడి అద్భుతం
ఇండియానాపోలీస్ : ఈ శీర్షిక చూసి అచ్చెరువొందుతున్నారా? అయితే, ఇకపై ఆశ్చర్యానికి ముగింపు చెబుదాం! గ్రేట్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ (గీత - జిఐటిఎ) సాహిత్య విభాగం 'సాహిత్య గీత' సంస్థ మే 3వ తేదీన నిర్వహించిన చిరస్మరణీయమైన సాహిత్య కార్యక్రమం ఈ శీర్షికకు నూటికి నూరు శాతం సరిపోతుంది. ఈ సందర్భంలో కృష్ణుడు అంటే ప్రముఖ కవి, గాయకుడు, సినిమా \ రంగస్థల కళాకారుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ అని అర్థం. రెండున్నర గంటల పాటు ప్రాచీన తెలుగు కవిత్వం, సాహిత్యం, రంగుల ప్రపంచం తెలుగు నాటకం గురించి ఆహూతులందరినీ మైమరపిస్తూ సుందర రామకృష్ణ తన కంచుకంఠంతో వీనుల విందుగా, హృదయానందం పూరితంగా, ఒడలు మైమరపించేలా సాహితీ ప్రసంగం నిర్వహించారు.
డాక్టర్ సుజాత పమ్మి, మాస్టర్ రాజారెడ్డి సందర్భానుకూలమైన చక్కని ప్రార్థనాగీతాలాపనతో గీత సాహిత్య విందు మొదలైంది. ఆ వెనువెంటనే సాహిత్య గీత చైర్మన్ డాక్టర్ డిహెచ్ ఆర్ శర్మ చదువుల తల్లి సరస్వతీ మాతను స్తుతిస్తూ తిరుపతి వేంకట కవులు రచించిన పద్యాన్ని వీనులవిందుగా పాడారు. చక్కని సాహిత్య విందుకు ఐఎంపిఎ ఆడిటోరియాన్ని అమర్చిపెట్టిన రాజారావు, శ్రీమతి జాబిలిరావులను సాహిత్య గీత సభ్యులుగా ఆహ్వానిస్తూ డాక్టర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాహిత్య కార్యక్రమం ఏర్పాటులో ఇతోధిక సేవలందించిన గీత కార్యదర్శి రాము చింతల, వలంటీర్ల కృషిని ఆయన కొనియాడారు. తనదైన శైలిలో సీసపద్యం పాడుతూ సదస్సు ముఖ్య వక్త డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గురించి ఒక సీసపద్యంలో వివరిస్తూ డాక్టర్ శర్మ సభకు పరిచయం చేశారు. డాక్టర్ అక్కిరాజు చక్కని సాంప్రదాయ దుస్తుల్లో వేదిక మీదకు వస్తూనే వాగ్దేవి స్తోత్రంతో సభాసదులను ఆశీర్వదించారు. అక్కిరాజుకు ఉన్న 'అభినంవ ఘంటసాల' అనే బిరుదును సార్ధకం చేసుకుంటూ తన విశిష్టమైన కంచుకంఠంతో అందరి హృదయాలనూ కొల్లగొట్టేశారు.
డాక్టర్ అక్కిరాజు సాహిత్య గోష్ఠిని ప్రాచీన కవిత్వం, తెలుగు నాటకం అనే రెండు ప్రధాన విభాగాలు నిర్వహించారు. ప్రాచీన సాహిత్యంలో వైభవం, ప్రాభవం, మార్దవం నిత్యనూతనంగా ప్రతిబింబించే తెలుగు సాహిత్యంలో కవిత్రయం కవులైన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడల సాహితీ సృష్టిలోని పలు పద్యాలను ఆయన శ్రావ్యంగా పాడి వినిపించారు. తరువాత శ్రీనాథ కవి సార్వభౌముని యుగం సాహితీ వైభవాన్ని సుందర రామకృష్ణ వివరించారు. 'సిరి గలవానికి చెల్లును...' లాంటి చాటువులను ఉటంకిస్తూ డాక్టర్ అక్కిరాజు చేసిన సాహితీ విందును ఆహూతులందరూ మైమరచి మరీ తనివితీరా ఆరగించారు. ఇంపా (ఐఎంపిఎ) ఆడిటోరియంలోని ప్రేక్షకులంతా రామకృష్ణ పాడిన శ్రీనాథుని సీసపద్యాల సొంపుతో తడిసి ముద్దయ్యారు. ఆ ఆనందం, అనుభూతి అనుభవైకవేద్యమే కాని ఎంతగా చెప్పినా చాలదు. పిమ్మట డాక్టర్ అక్కిరాజు శ్రీకృష్ణ దేవరాయల యుగంలోని అష్టదిగ్గజాల సాహితీ సేవ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అష్ట దిగ్గజాల్లో అగ్రజుడు అల్లసాని పెద్దన పెద్దరికం గురించి, వికట కవి, తెలివైన తెనాలి రామకృష్ణుడి చాకచక్యం గురించి హృద్యంగా వివరించారు. నంది తిమ్మన సాహితీ సృష్టి తదితర పలు అంశాలను తేటతెల్లంగా వర్ణించారు.
Pages: 1 -2- News Posted: 13 May, 2009
|