టాన్ టెక్స్ సూపర్ సింగర్
డల్లాస్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్ టెక్స్) నిర్వహించిన 'తానా - మా టీవి ఇండో అమెరికన్ సూపర్ సింగర్' పోటీలకు చక్కని స్పందన లభించింది. మే 30వ తేదీన ప్లానోలోని ఫ్లవర్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ పోటీల్లో డల్లాస్ పరిసర ప్రాంతాల్లో నుంచి 26 మంది గాయనీ గాయకులు పాల్గొన్నారు.
మా టీవీలో వచ్చిన సూపర్ సింగర్ నిబంధనల ఆధారంగానే పోటీని మూడు రౌండ్లుగా నిర్వహించారు. ప్రతి పోటీ దారునికి న్యాయనిర్ణేతలు తమ చక్కని సలహాలు, సూచనలు అందజేశారు. విజేతల ఎంపిక ఆయా పోటీదారులు తెచ్చుకున్న పాయింట్ల ఆధారంగా జరిగింది. 1) పాట ఎంపిక, 2) స్వరం - తాళం, 3) వాచికం, సాహిత్యంపై అవగాహన, 4) స్వర నాణ్యత, 5) పోటీదారు పూర్తి పెర్ఫార్మెన్స్ అనే అంశాలుగా విభజించారు. ఈ మొత్తం అంశాలకు పది పాయింట్లు కేటాయించారు. పోటీదారు ఆయా అంశాల్లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు పాయింట్లు ఇస్తారు.
పోటీల తొలి రౌండ్ లో 26 మంది పాల్గొనగా వారి నుంచి 10 మందిని రెండో రౌండ్ కు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. రెండో రౌండ్ లో పాల్గొన్న వారు ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ రౌండ్ కు నలుగురు ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్ లో పాల్గొన్న నలుగురి నుంచి అత్యంత ప్రతిభ ప్రదర్శించిన ఇద్దరిని విజేతలుగా నిర్ణయించారు.
ఫైనల్ రౌండ్ పోటీ నరాలు తెగిపోతాయా అన్నంత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. పోటీదారులు తమ గాత్ర నైపుణ్యం కారణంగా కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో పూర్తిగా నిశ్శబ్ద వాతావరణం రాజ్యమేలింది. ఫైనల్స్ లో పాల్గొనేందుకు ఇద్దరిని ఎంపిక చేయడం న్యాయనిర్ణేతలకు నిజంగా పరీక్షగానే మారింది. ప్రియ పర్వతనేని, మాధురి చివుకుల, శృజన ఆదూరి, గాయత్రి కందాడై సెమీ ఫైనల్లో పోటీపడ్డారు. న్యాయమూర్తుల నిర్ణయం కోసం ఆడిటోరియం అంతా ఆతృతగా ఎదురు చూస్తుండగా మాధురి చివుకుల, శృజన ఆదూరి ఫైనల్ పోటీకి ఎంపికైనట్లు ప్రకటించారు. మాధురి హ్యూస్టన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, శృజన డల్లాస్ లో ఒరాకిల్ డిబిఎ గా పనిచేస్తున్నారు. ఆఖరి రౌండ్ లో మాధురి 'నేనున్నాను' సినిమాలోని 'ఏ శ్వాసలో చేరితే' పాట పాడగా, శృజన 'గోరంత దీపం' చిత్రంలోని 'రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా' ఆలపించారు.
Pages: 1 -2- News Posted: 2 June, 2009
|