'భావి సూపర్ పవర్ భారత్'
న్యూయార్క్ : భవిష్యత్ లో భారతదేశం సూపర్ పవర్ గా ఆవిర్భవించడం తథ్యమని భారతదేశ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ నెరపుతున్న స్నేహ సంబంధాలు, సహాయ సహకారాల మూలంగా భారత్ మరింత బలపడుతున్నదని, తాను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడమే సూపర్ పవర్ గా ఎదగడానికి దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా భారతదేశం ఇటీవల పది శాటిలైట్లను ఒకేసారి విజయవంతంగా నింగిలోకి పంపిన చారిత్రక ఘట్టాన్ని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. 2004 - 07 సంవత్సరాల మధ్య కాలంలో భారతీయ కార్పొరేట్ రంగం అమెరికాలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. ఈ విషయం ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించిందని ఆయన తెలిపారు. ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఎన్ ఓసి - ఐనాక్) తన గౌరవార్ధం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక నుంచి భారత స్వాతంత్ర్య పోరాటం వరకూ గల పరిణామాలు, ఆరు దశాబ్దాల స్వేచ్ఛా భారతంలో కాంగ్రెస్ ప్రస్తానం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత తాజా విజయాలు లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఐనాక్ సభ్యులు తన గౌరవార్థం నిర్వహించిన సన్మాన కార్యక్రమం పట్ల ఆనంద్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
భారత కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మకు ఐనాక్ జూన్ 19న న్యూయార్క్ లోని ప్రతిష్టాత్మకమైన మారియట్ మార్క్విస్ హొటల్ లో ఘనంగా సన్మానించింది. వెస్ట్ సైడ్ బాల్ రూమ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది ఐనాక్ సభ్యులు, పలువురు ప్రవాస భారయతీయ ప్రముఖులు హాజరయ్యారు. అమెరికాలో పలు ప్రముఖ గ్రూపులతోను, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్ కిర్క్ తదితరులతో వరుస సమావేశాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఐనాక్ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.
ఐనాక్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ నజ్మా సుల్తానా, వివిధ చాప్టర్ల అధ్యక్షులను వేదిక మీదికి ఆహ్వానించారు. అలాగే ఐనాక్ వైస్ ప్రెసిడెంట్ మొహిందర్ సింగ్ గిల్జియన్, ప్రధాన కార్యదర్శి జార్జి అబ్రహాం, జాతీయ వైస్ ప్రెసిడెంట్ షూద్ జాసుజ, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మహేష్ సలాది, అమెరికాలో భారత రాయబారి హర్ దీప్ సింగ్ పురి, డిప్యూటీ కాన్సల్ జనరల్ డాక్టర్ గోండె వేదికను అలంకరించారు.
Pages: 1 -2- News Posted: 23 June, 2009
|